నాకు పార్కిన్సన్ వ్యాధి (వణుకుడు రోగం) వచ్చింది, మహా అయితే మరో పదేళ్లు బతుకుతానేమో... ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు... ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలెన్ బోర్డర్...
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం అలెన్ బోర్డర్, పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నట్టు షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. 1987 వరల్డ్ కప్ విన్నర్ అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో 10 వేల పరుగులు అందుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..
150కి పైగా టెస్టులు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచిన అలెన్ బోర్డర్, 1978 నుంచి 1994 వరకూ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తరుపున 156 టెస్టులు, 256 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 27 సెంచరీలతో 11,174 పరుగులు చేసిన అలెన్ బోర్డర్, వన్డేల్లో 3 సెంచరీలతో 6524 పరుగులు చేశారు. అంతేకాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా టెస్టుల్లో 39, వన్డేల్లో 73 వికెట్లు తీశాడు..
‘నేను న్యూరోసర్జర్‌ని కలిశాను, అతను ఎలాంటి మొహమాటం లేకుండా నాకు పార్కిన్సన్ వ్యాధి (వణుకుడు రోగం) వచ్చిందని చెప్పాడు. ఎప్పటిలాగే నడవమని సూచించాడు. చేతులు కిందకి పెట్టుకోవచ్చు కానీ ఊపకూడదని సూచించాడు..
నేను చాలా సింపుల్ ప్రైవేట్ పర్సన్‌ని. నాకు జనాల సానుభూతి అవసరం లేదు. వాళ్లు ఏమనుకుంటున్నారో కూడా నేను పట్టించుకోను. కొన్నిరోజుల తర్వాత జనాలకు ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు ఈ విషయాన్ని దాచినందుకు నేను బాధపడకూడదు..
నాకిప్పుడు 68 ఏళ్లు. నేను 80 ఏళ్ల దాకా బతికితే అది అద్భుతమే. నాకు ఓ డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను కూడా ఇదే చెప్పాడు. అయితే బతికింతకాలం సంతోషంగా ఉండాలనే అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు అలెన్ బోర్డర్..
పార్కిన్సన్ వ్యాధి మనిషి నాడీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. నరాలు దెబ్బ తినడంతో ప్రారంభ దశలో చేతులు, కాళ్లు, దవడలు, మెడ వంటి అవయవాలు వణకడం మొదలవుతుంది. ఆ తర్వాత నరాలు బిగుసుకుపోయి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటారు. దీనికి ఇప్పటిదాకా కచ్ఛితమైన ట్రీట్‌మెంట్‌ని కనుగొనలేకపోయింది వైద్యశాస్త్రం..
అలెన్ బోర్డర్ టీమ్‌మేట్ డీన్ జోన్స్ కూడా ఈ పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్డారు. 2020లో డీన్ జోన్స్, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోగా ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ రాడ్ మార్ష్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ముగ్గురూ కూడా గత ఏడాదే ప్రాణాలు కోల్పోయారు..
షేన్ వార్న్, థాయ్‌లాండ్‌లోని తన రిసార్ట్‌లో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోగా, ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
