Steffan Nero: టీ20లు వచ్చిన తర్వాత డబుల్, ట్రిపుల్ సెంచరీలు మరిచిపోయారు క్రికెట్ అభిమానులు. టెస్టు క్రికెట్ లో అడపా దడపా నమోదవుతున్నా వన్డేలలో ఈ రికార్డు క్రియేట్ చేయడం గొప్ప విషయమే కదా..
ఆస్ట్రేలియా అంధ క్రికెటర్ స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లోని రెండో మ్యాచ్ లో భాగంగా అతడు.. ఎదుర్కున్న 140 బంతుల్లో ఏకంగా 309 పరుగులు చేశాడు. మూడు గంటల పాటు సాగిన నీరో బ్యాటింగ్ విన్యాసంలో ఏకంగా 49 బౌండరీలు, ఒక సిక్సర్ కూడా ఉంది. అంటే ఫోర్లు, సిక్సర్ ద్వారానే నీరో 202 పరుగులు రాబట్టడం విశేషం. ఇదిలాఉండగా 309* రన్స్ చేయడం ద్వారా నీరో.. గతంలో పాకిస్తాన్ బ్యాటర్ మసూద్ జాన్ పేరిట ఉన్న అత్యధిక స్కోరు (262 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు.
మసూద్.. 1998లో అంధుల క్రికెట్ ప్రపంచ కప్ లో 262 రన్స్ సాధించాడు. ఇప్పటివరకు ఇదే రికార్డుగా ఉండేది. ఇప్పుడు నీరో దానిని బ్రేక్ చేసి కొత్త రికార్డులు నెలకొల్పడమే గాక ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.
కాగా ఆసీస్-కివీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో నీరో రెచ్చిపోవడంతో కంగారూలు 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 542 పరుగులు చేశారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్.. 272 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా ఆసీస్.. 270 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు గాను కివీస్ అంధుల జట్టు ఆసీస్ లో పర్యటిస్తున్నది. ఈ పర్యటనలో భాగంగా చివరి వన్డే శుక్రవారం జరుగనుంది.
ఇక ట్రిపుల్ సెంచరీ చేయడంతో ఆసీస్ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో క్రికెటర్ గా నీరో రికార్డులకెక్కాడు. గతంలో మాథ్యూ హెడెన్, మైకెల్ క్లార్క్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు త్రిపుల్ సెంచరీ చేసిన జాబితాలో ఉన్నారు. ఇప్పుడు నీరో వారి సరసన నిలిచాడు.
ట్రిపుల్ సెంచరీ చేసే క్రమంలో అతడి బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 224.5 గా నమోదు కావడం విశేషం. ఈ టోర్నీలో అతడిప్పడికే రెండు సెంచరీలు (113, 101) చేశాడు. తన రికార్డుపై నీరో మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో వన్డేలు ఆడటం ఇదే తొలిసారి. మ్యాచ్ మధ్యలో కాస్త అలసటగా అనిపించింది. అప్పుడు నేను ఔట్ అవుతానేమో అనిపించింది. సాధారణ క్రికెటర్లతో పోలిస్తే మాకు (అంధులకు) చాలా సేపు క్రీజులో నిలవడం, ఏకాగ్రతతో బ్యాటింగ్ చేయడం కష్టంతో కూడుకున్నది. కానీ నేను మాత్రం ఎక్కడా ఢీలాపడలేదు. నా సహచరులు కూడా నాకు మంచి మద్దతునిచ్చారు. నేను బౌండరీలు బాదుతుంటే ఇంకా కొట్టమని నన్ను ఎంకరేజ్ చేశారు’ అని తెలిపాడు.
