చెన్నై వన్డేలో టీమిండియా ఓటమి! వన్డే సిరీస్ ఆస్ట్రేలియా వశం.. సిరీస్ కోల్పోయి, నెం.1 ర్యాంకు కూడా...
టాపార్డర్ రాణించినా దక్కని విజయం! మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ, 40 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా.. 4 వికెట్లు తీసి టీమిండియాని ఓడించిన ఆడమ్ జంపా..

చెన్నై వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా మూడో వన్డేలో గెలిచిన ఆస్ట్రేలియా, వన్డే సిరీస్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో నెం.1 టీమ్‌గా అవతరించింది. 270 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా... టాపార్డర్ బ్యాటర్లు రాణించినా మిడిల్ ఆర్డర్‌లో సరైన భాగస్వామ్యం నమోదు కాకపోవడంతో 49.1 ఓవర్లలో 248 పరుగులకి ఆలౌట్ అయ్యింది... 21 పరుగుల తేడాతో డిసైడర్ మ్యాచ్‌ని గెలిచిన ఆస్ట్రేలియా.. 2-1 తేడాతో వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుంది..
భారీ లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన రోహిత్ శర్మ, సీన్ అబ్బాట్ బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
49 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం దక్కింది. కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
50 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి బౌండరీ లైన్ దగ్గర సీన్ అబ్బాట్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 4 బంతుల్లో 2 పరుగులు చేసిన అక్షర్ పటేల్, విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్ అయ్యాడు.
61 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, దూకుడుగా ఆడేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు. హాఫ్ సెంచరీ తర్వాత 12 బంతుల్లో 4 పరుగులే చేసిన విరాట్ కోహ్లీ, అస్టన్ అగర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, మూడో వన్డేలోనూ మొదటి బంతికే పెవిలియన్ చేరాడు... మొదటి రెండు మ్యాచుల్లో ఆసీస్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, మూడో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ అస్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు బాదేందుకు హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా తెగ ఇబ్బంది పడ్డారు. 40 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
హార్ధిక్ పాండ్యా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా విజయానికి ఇంకా 52 పరుగులు కావాలి. బంతిని కనెక్ట్ చేయడానికి తెగ ఇబ్బంది పడిన రవీంద్ర జడేజా 33 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసి, ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టోయినిస్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జడ్డూ అవుట్ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైపోయింది..
10 బంతుల్లో 14 పరుగులు చేసిన మహ్మద్ షమీ, స్టోయినిస్ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఫోర్ బాది, ఆ తర్వాతి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ 6 పరుగులు చేసి ఆఖరి ఓవర్ తొలి బంతికి రనౌట్ అయ్యాడు.