యాషెస్ సీరిస్ లో ఇంగ్లాండ్ బౌలర్ జొఫ్రా ఆర్చర్ నిప్పులు చెరుగుతున్నాడు. రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కీలక ప్లేయర్ స్టీవ్ స్మిత్ ను కూడా ముప్పుతిప్పలు పెట్టి చివరకు తీవ్రంగా గాయపర్చాడు. అతడి చేతిలోంచి 149కిమీ వేగంతో  దూసుకెళ్లిన బంతి స్మిత్ మెడకు తాకి తీవ్రంగా గాయపర్చింది. నొప్పితో విలవిల్లాడిపోయిన స్మిత్ మైదానంలోనే కుప్పకూలాడు. ఇలా ఆర్చర్ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ఆసిస్ ఆటగాళ్లంతా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే మార్నస్ లబుషేన్ మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. దీంతో ఆసిస్ ఓటమినుండి బయటపడి  మ్యాచ్ ను డ్రాతో ముగించింది. 

అయితే మ్యాచ్ అనంతరం లబుషేన్ మాట్లాడుతూ ఆర్చర్ బౌలింగ్ తాను అనుకున్నంత అద్భుతంగా ఏమీ  లేదన్నాడు. డ్రెస్సింగ్ రూంలో కూర్చుని చూస్తే అతడి  బౌలింగ్ చాలా  భయంకరంగా కనిపించదన్నాడు. దీంతో స్మిత్ స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగే అవకాశం వచ్చినపుడు అతన్ని ఎదుర్కోగలనా అన్న చిన్న భయం వుంది. కానీ క్రీజులో నిలబడి చూస్తేగాని ఆర్చర్ అంత భయంకరమైన బౌలరేమీ కాదన్న విషయం అర్థమైందని లబుషేన్ పేర్కొన్నాడు. 

ఆర్చర్ బౌలింగ్ లో తాను మొదట్లో కాస్త ఇబ్బందిపడ్డాను. తలపైకి దూసుకొచ్చిన ఓ బంతి నా హెల్మెట్ ను తాకింది. అయినా భయపడకుండా కేవలం పరుగులు సాధించి జట్టును ఆదుకోవాలనే పట్టుదలతో ఆడాను. ఆర్చర్ విసిరిన కొన్ని అద్భుుతమైన  బంతులను గౌరవిస్తూనే చెత్త బంతులకు పరుగుల రాబట్టానని లబుషేన్ వెల్లడించాడు.

కేవలం ఆర్చర్ ఒక్కడినే కాదు ఇంగ్లీష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న లబుషేన్ హాఫ్ సెంచరీ(59 పరుగులు) బాదాడు. దీంతో ఓటమిఅంచుల్లో నిలిచిన ఆసిస్ డ్రాతో మ్యాచ్ ముగించగలిగింది. ఇలా యాషెస్ సీరిస్ లో ఆసిస్ ఆతిథ్య జట్టుపై 1-0 ఆధిక్యంతో నిలిచేలా చేశాడు.