Asia Cup 2023: శ్రీలంక ఘన విజయం... ఫైనల్ రేసు నుంచి బంగ్లాదేశ్ అవుట్...
Asia Cup 2023: బంగ్లాదేశ్‌పై 21 పరుగుల తేడాతో శ్రీలంక విజయం.. 82 పరుగులు చేసిన తోహిడ్ హృదయ్.. వరుసగా రెండో పరాజయంతో ఫైనల్ రేసు నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్..

ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో శ్రీలంక బోణీ కొట్టింది.. కొలంబోలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా ముగిసింది. 258 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్, 48.1 ఓవర్లలో 236 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 21 పరుగుల తేడాతో శ్రీలంక విజయం అందుకుంది. వరుసగా రెండో పరాజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్, ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది..
మహ్మద్ నయీం 21, మెహిదీ హసన్ మిరాజ్ 28, లిట్టన్ దాస్ 15, షకీబ్ అల్ హసన్ 3, ముస్తాఫికర్ రహీం 29, షమీమ్ హుస్సేన్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు.. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన తోహిడ్ హృదయ్ 97 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. టస్కిన్ అహ్మద్ 1, షోరిఫుల్ ఇస్లాం 7 పరుగులు చేశారు.
దసున్ శనక, మహీశ్ తీక్షణ, మతీశ పథిరాణా మూడేసి వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 257 పరుగుల స్కోరు చేసింది..
మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయినా కుసాల్ మెండిస్, సధీర సమరవిక్రమ హాఫ్ సెంచరీలతో రాణించి... లంకకు భారీ స్కోరు అందించారు. 17 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన దిముత్ కరుణరత్నే, హసన్ మహమూద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
పథుమ్ నిశ్శంక 60 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసి షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నిశ్శంక, కుసాల్ మెండిస్ కలిసి రెండో వికెట్‌కి 74 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 73 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేసిన కుసాల్ మెండిల్ కూడా షోరిఫుల్ ఇస్లాం బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు..
చరిత్ అసలంక 10 పరుగులు చేయగా ధనంజయ డి సిల్వ 6 పరుగులు, దసున్ శనక 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 3 పరుగులు చేసిన దునిత్ వల్లలాగే రనౌట్ అయ్యాడు. మహీశ్ తీక్షణ 2 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన సధీర సమరవిక్రమ 72 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో 4, 6 బాదిన సమరవిక్రమ, చివరి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.