Asia Cup 2023: 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసిన శ్రీలంక... 92 పరుగులు చేసి రనౌట్ అయిన కుసాల్ మెండిస్..
ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా లాహోర్‌లో జరుగుతున్న ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై భారీ స్కోరు చేసింది శ్రీలంక. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేయగలిగింది..
పథుమ్ నిశ్శంక 40 బంతుల్లో 6 ఫోర్లతో 41 పరుగులు చేయగా దిముత్ కరుణరత్నే 35 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 63 పరుగులు జోడించారు. సదీర సమరవిక్రమ 3 పరుగులకే అవుట్ అయినా కుసాల్ మెండిస్ 84 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. సెంచరీకి 8 పరుగుల దూరంలో కుసాల్ మెండీస్ రనౌట్ అయ్యాడు..
చరిత్ అసలంక 43 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేయగా ధనుంజయ డి సిల్వ 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేశాడు. కెప్టెన్ దస్సున్ శనక 5 పరుగులు చేసి అవుట్ కాగా దునిత్ వెల్లలాగే 39 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు మహీశ్ తీక్షణ 24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేశారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాటర్లు 25+ స్కోర్లు చేశారు..
ఆఫ్ఘాన్ బౌలర్ గుల్బాదిన్ నయీబ్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా రషీద్ ఖాన్‌కి 2 వికెట్లు దక్కాయి. ముజీబ్ వుర్ రహీమ్ ఓ వికెట్ తీశాడు. 9వ వికెట్‌కి మహీశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే కలిసి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆసియా కప్ చరిత్రలో 8 అంతకంటే కింది స్థానాల్లో ఇది నాలుగో అత్యుత్తమ భాగస్వామ్యం.
ఇంతకుముందు 2008లో పాకిస్తాన్ ప్లేయర్లు ఫవాద్ ఆలం- సోహైల్ తన్వీర్ 8వ వికెట్‌కి హంగ్‌కాంగ్‌పై 100 పరుగులు జోడించారు. 2018లో ఆఫ్ఘాన్ ప్లేయర్లు గుల్బాదిన్ నయీబ్- రషీద్ ఖాన్, బంగ్లాదేశ్‌పై 95 పరుగులు జోడించగ, 2018లో బంగ్లాదేశ్ ప్లేయర్లు ముషరఫే ముర్తాజా - మెహిదీ హసన్ మిరాజ్, టీమిండియాపై 66 పరుగులు జోడించారు.
ఆసియా కప్ 2023 గ్రూప్ బీలో ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్ చెరో విజయం అందుకున్నాయి. శ్రీలంక ఇప్పటికే ఆసియా కప్ సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించింది. బంగ్లాదేశ్‌ని వెనక్కి నెట్టి, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించాలంటే 37.1 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది.
