ఇండియాను చూడండి, షాదాబ్ ను ఎందుకు ఆడించారు: పాక్ ఓటమిపై ఆఫ్రిదీ ఫైర్
ఆసియా కప్ టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిష్క్రమించిన తీరుపై షాహిద్ ఆఫ్రిదీ మండిపడ్డాడు. విఫలమవుతూ వచ్చిన షాబాద్ ను ప్రతి మ్యాచులోనూ ఆడించడాన్ని ఆయన ప్రశ్నించారు.
ఆసియా కప్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు వైఫల్యంపై ఆ దేశం క్రికెట్ జట్టు మాజీ షాహిద్ ఆఫ్రిదీ తీవ్రంగా మండిపడ్డాడు. ఆసియా కప్ ను చేజిక్కించుకుంటుందని భావించిన పాకిస్తన్ గురువారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై ఓటమి పాలై టోర్నమెంటు నుంచి నిష్క్రమించింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో పాకిస్తాన్ 78 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కుశాల్ మెండిస్, చరిత్ అసలంక చాలా తెలివిగా ఆడి చివరి బంతికి శ్రీలంకకు విజయం చేకూర్చి పెట్టారు.
పాకిస్తాన్ ఓటమిపై స్పందిస్తూ జట్టు ఎంపికలో చేసిన తప్పులను ఆఫ్రిదీ ఎత్తి చూపాడు. లైన్ అప్ పై ప్రయోగాలు చేయకపోవడంపై, షాదాబ్ ఖాన్ ను బెంచీకి పరిమితం చేయకపోవడంపై ఆయన జట్టు యాజమాన్యంపై మండిపడ్డారు.షాదాబ్ ఖాన్ సరిగా ఆడలేకపోయినప్పుడు ప్రతి మ్యాచ్ లోనూ ఎందుకు కొనసాగించారని ఆయన ప్రశ్నించారు.
ఇది ఈనాటి సమస్య కాదని, ఎప్పటి నుంచో ఉన్న సమస్యేనని ఆయన అన్నారు. ఆసియా కప్ ఆడుతున్న భారత్ ప్రతి మ్యాచ్ లోనూ తుది జట్టులో మార్పులు చేస్తూ వచ్చిందని, సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి జూనియర్లతో ఆడించారని, వాళ్లు ప్రపంచ కప్ కు సిద్ధమవుతున్నారని, ఇటువంటి నిర్ణయాలు అత్యంత ప్రధానమైనవని అన్నారు. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసుకుంటామని, బెంచీ మీద కూర్చునే అటగాళ్లు కూడా తుది జట్టులోకి వచ్చే ఆటగాళ్లతో సమానమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉంటారని, ఫస్ట్ చాయిస్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంలో తప్పు లేదని ఆయన సమా టీవీతో అన్నారు.
షాదాబ్ కు విశ్రాంతి ఇస్తే ఒసామా మీర్ ఉన్నాడని, గతంలో పాకిస్తాన్ తరఫున బాగా ఆడిన సందర్భాలున్నాయని ఆయన అన్నాడు. కొన్ని మ్యాచ్ లో ఎవరైనా సరిగా ఆడకపోతే అతన్ని తర్వాతి మ్యాచులకు పక్కన పెట్టాల్సి ఉంటుందని, 25 మంది సభ్యులతో కూడిన జట్టు నుంచి తొలగించాలని తాను అనడం లేదని, జట్టులోనే కొనసాగిస్తూ విశ్రాంతి ఇవ్వాలని, బౌలింగ్ కోచ్ తోనూ హెడ్ కోచ్ తోనూ మాట్లాడించాలని, తమ ప్రణాళికలేమిటో నిజంగా తనకు తెలియదని ఆయన అన్నారు.
ఆసియా కప్ లో ఆల్ రౌండర్ షాదాబ్ కాన్ తన ముద్రను వేయలేకపోయాడు. స్పిన్నర్ షాదాబ ఐదు మ్యాచుల్లో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అందులోనూ నాలుగు వికెట్లు నేపాల్ మీద సాధించినవి. శ్రీలంకపై జరిగిన మ్యాచులో 9 ఓవర్ల వేసి 55 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ మాత్రమే తీశాడు.