Asia Cup 2023: బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఈజీ విక్టరీ... మహ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ హాఫ్ సెంచరీలు..
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న పాకిస్తాన్... పాక్‌లో ముగిసిన ఆసియా కప్ మ్యాచులు.. సెప్టెంబర్ 9 నుంచి కొలంబోలో మిగిలిన మ్యాచులు..

ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్, సూపర్ 4 రౌండ్‌లో తొలి విజయాన్ని అందుకుంది. లాహోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. ఈ మ్యాచ్‌తో పాకిస్తాన్‌లో మ్యాచులు పూర్తి అయ్యాయి. ఇకపై మిగిలిన మ్యాచులన్నీ కొలంబో వేదికగా జరగబోతున్నాయి.
194 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన పాకిస్తాన్, టార్గెట్ చిన్నది కావడంతో ఎక్కడా కంగారుపడకుండా బ్యాటింగ్ చేసింది. 5 ఓవర్లలో 15 పరుగులు చేసిన సమయంలో ఫ్లడ్ లైట్ ఫెయిల్యూర్ కారణంగా పావుగంట సేపు ఆటకు నిలిచిపోయింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత 31 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన ఫకార్ జమాన్ వికెట్ కోల్పోయింది పాకిస్తాన్..
22 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 84 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులు చేసిన పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్, మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
అయితే అప్పటికే పాక్ విజయానికి చాలా చేరువైంది. మహ్మద్ రిజ్వాన్ 79 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు, అఘా సల్మాన్ 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 38.4 ఓవర్లలో 193 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మెహిదీ హసన్ మిరాజ్, నసీం షా బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ మొహమ్మద్ నయీం 25 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేయగా లిట్టన్ దాస్ 13 బంతుల్లో 4 ఫోర్లతో 16 పరుగులు చేశాడు.
తోహిడ్ హృదయ్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేశ్. ఈ దశలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్, ముస్తాఫికర్ రహీం కలిసి ఐదో వికెట్‌కి 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
57 బంతుల్లో 7 ఫోర్లతో 53 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్, ఫహీం ఆష్రఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన షమీమ్ హుస్సేన్‌ని ఇఫ్తికర్ అహ్మద్ అవుట్ చేశాడు. 87 బంతుల్లో 5 ఫోర్లతో 64 పరుగులు చేసిన ముస్తాఫికర్ రహీం, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికి టస్కిన్ అహ్మద్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
అతిఫ్ హుస్సేన్ 12, షోరిఫుల్ ఇస్లాం 1 పరుగు చేసి నసీం షా బౌలింగ్‌లో అవుట్ కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 38.4 ఓవర్లలో ముగిసింది.
పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్ 6 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 5.4 ఓవర్లు వేసిన నసీం షా 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షాహీన్ ఆఫ్రిదీ, ఇఫ్తికర్ అహ్మద్, ఫహీం ఆష్రఫ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.