Asianet News TeluguAsianet News Telugu

మంచి మనసు చాటుకున్న మహ్మద్ సిరాజ్... మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రివార్డును గ్రౌండ్ స్టాఫ్‌కి ఇస్తూ...

కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్‌తో ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన మహ్మద్ సిరాజ్... తన క్యాష్ రివార్డును శ్రీలంక గ్రౌండ్‌మెన్‌కి బహుకరిస్తున్నట్టు ప్రకటన.. 

Asia Cup 2023: Mohamed Siraj gives his man of match award of 5000 US dollars to the Groundsmen CRA
Author
First Published Sep 17, 2023, 7:48 PM IST

ఆసియా కప్ 2023 టైటిల్ ఫైనల్ ఫైట్, మూడు గంటల్లోనే ముగిసిపోయింది. ఇండియా- శ్రీలంక మధ్య హోరాహోరీ ఫైనల్ ఫైట్ చూడాలని ఆశపడిన క్రికెట్ ఫ్యాన్స్‌కి భారత జట్టు వన్ సైడ్ వార్ కనిపించింది. దీనికి కారణం మహ్మద్ సిరాజ్ సెన్సేషనల్ స్పెల్..

రెండో ఓవర్‌లో మెయిడిన్ వేసిన మహ్మద్ సిరాజ్, ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్.. మొత్తంగా 6 వికెట్లతో కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసుకున్నాడు..

ఈ ఇన్నింగ్స్ కారణంగా ఆసియా కప్ 2023 ఫైనల్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు మహ్మద్ సిరాజ్. ఈ అవార్డు ద్వారా వచ్చిన 5 వేల డాలర్ల (రూ. 4 లక్షల 15 వేలకు పైగా) చెక్‌ని తన ద్వారా శ్రీలంక గ్రౌండ్ స్టాఫ్‌కి ఇవ్వాల్సిందిగా ప్రకటించి, అందరి మనసు గెలుచుకున్నాడు మహ్మద్ సిరాజ్..

‘తిందామన్నా ఇక్కడ బిర్యానీ దొరకదు. చాలా రోజులుగా నేను బాగానే బౌలింగ్ వేస్తున్నా. అయితే కొన్ని రోజులుగా ఎడ్జ్ తగిలిపోవడం వల్ల వికెట్లు దక్కలేదు. ఈరోజు నేను అనుకున్నట్టుగా వికెట్లు పడ్డాయి. ఈ వికెట్‌ స్వింగ్‌కి చక్కగా అనుకూలిస్తోంది..

నేను పెద్దగా కష్టపడకుండానే వికెట్లు తీయవచ్చని అనిపించింది. వికెట్ల కోసం ప్రయత్నించకుండా బౌలింగ్ వేశా, వికెట్లు దక్కాయి. నేను ఆ బౌండరీని ఆపితే బాగుంటుందని అనుకున్నా. అందుకే ఆఖరి వరకూ పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రయత్నించా..

నా కెరీర్‌లో ఇది బెస్ట్ స్పెల్ అని చెప్పొచ్చు. నాకు వచ్చిన ఈ క్యాష్ రివార్డును గ్రౌండ్‌మెన్‌కి ఇవ్వాలని అనుకుంటున్నా. వాళ్లు లేకుండా ఈ టోర్నీ సజావుగా ముగిసేది కాదు. వాళ్లు పడిన కష్టానికి, శ్రమకి ఎంత ఇచ్చినా తక్కువే. వాళ్లే రియల్ హీరోలు..’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ సిరాజ్..  

ఆసియా కప్ 2023 ఫైనల్‌లో టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, 15.2 ఓవర్లలో 50 పరుగులకి ఆలౌట్ అయ్యింది. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 

7 ఓవర్లు బౌలింగ్ చేసిన మహ్మద్ సిరాజ్, ఓ మెయిడిన్‌తో 21 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. హార్ధిక్ పాండ్యా 2.2 ఓవర్లలో 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జస్ప్రిత్ బుమ్రా 5 ఓవర్లలో ఓ మెయిడిన్‌తో 23 పరుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు..

ఈ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది భారత జట్టు. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 3 ఫోర్లతో 23 పరుగులు చేయగా శుబ్‌మన్ గిల్ 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios