Asia Cup 2023 INDvsPAK: టాస్ గెలిచిన పాకిస్తాన్... కెఎల్ రాహుల్ రీఎంట్రీ..
Asia Cup 2023 India vs Pakistan Super 4: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్... కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ..

ఆసియా కప్ 2023 సూపర్ 4 రౌండ్‌లో భాగంగా నేడు ఇండియా, పాకిస్తాన్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
ఇరు జట్ల మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది. అయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 266 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టాపార్డర్‌లో రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు..
దీంతో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్‌ని భారత జట్టు టాపార్డర్ ఎలా ఎదుర్కొంటుంది? అనేది నేటి మ్యాచ్‌లో కీలకంగా మారింది. కొలంబోలో విరాట్ కోహ్లీకి అదిరిపోయే రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన గత మూడు మ్యాచుల్లోనూ సెంచరీలు చేశాడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో 13 వేల పరుగులకు చేరువలో ఉన్న విరాట్ కోహ్లీ, నేటి మ్యాచ్‌లో సెంచరీ చేస్తే ఆ మైలురాయి అందుకుంటాడు..
కెఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి, టీమ్‌తో కలిశాడు. దీంతో పాకిస్తాన్‌తో గత మ్యాచ్‌లో 82 పరుగులు చేసి మెప్పించిన ఇషాన్ కిషన్ రిజర్వు బెంచ్‌కే పరిమితం కావాల్సి రావచ్చని అందరూ అనుకున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చాడు.. అలాగే నేపాల్‌తో మ్యాచ్‌కి అందుబాటులో లేని జస్ప్రిత్ బుమ్రా కూడా తిరిగి వచ్చేశాడు..
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ ప్లేస్‌లో టీమ్‌లోకి తిరిగి వచ్చాడు. కొలంబోలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందుకే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి రిజర్వు డే కూడా కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. అయితే ఇదే స్టేడియంలో సెప్టెంబర్ 9న శ్రీలంక- బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌కి ఎలాంటి అంతరాయం కలగలేదు. అలాంటి వాతావరణం నేటి మ్యాచ్‌లో కూడా ఉంటే, ఫలితం రావడం పెద్ద కష్టమేమీ కాదు..
పాకిస్తాన్, ఇప్పటికే సూపర్ 4 రౌండ్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ని ఓడించింది. శ్రీలంక కూడా బంగ్లాని ఓడించి బోణీ కొట్టింది. కాబట్టి భారత జట్టు, నేటి మ్యాచ్‌లో గెలిస్తే... మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ఫైనల్ చేరే ఛాన్స్ ఉంటుంది. ఇది ఓడితే, మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి వస్తుంది..
నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చెత్త ఫీల్డింగ్ తీవ్ర విమర్శలు రావడానికి కారణమైంది. నేటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించాలంటే టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చి తీరాల్సిందే.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముందు పాకిస్తాన్‌పై టీమిండియా విజయం, అత్యంత ఆవశ్యకం కూడా..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
పాకిస్తాన్ జట్టు: ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, అఘా సల్మాన్, షాదబ్ ఖాన్, ఫహీం ఆష్రఫ్, నసీం షా, హారీస్ రౌఫ్