ఆసియా కప్ సక్సెస్‌లో అసలైన హీరోలు మీరే! లంక గ్రౌండ్ స్టాఫ్‌కి భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన జై షా..
Asia Cup 2023: పల్లెకెలె, కొలంబో గ్రౌండ్ సిబ్బందికి 50 వేల డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్... ఆసియా కప్ 2023 టోర్నీ సక్సెస్‌కి మీరే కారణమంటూ జై షా ట్వీట్..
వర్షా కాలంలో, అది కూడా వానలు ఎక్కువగా ఉండే శ్రీలంక నగరాల్లో ఆసియా కప్ 2023 టోర్నీని నిర్వహించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. హైబ్రీడ్ మోడల్‌లో పాకిస్తాన్‌లో జరిగిన నాలుగు మ్యాచులు ఎలాంటి ఆటంకం లేకుండా ముగిస్తే, లంకలో జరిగిన మ్యాచులకు వర్షం ఆటంకం కలిగించింది..
సూపర్ 4 రౌండ్‌కి ముందు కొలంబోలో భారీ వర్షాలు కురిశాయి. ఇక్కడి నుంచి టోర్నీని మరో వేదికకు తరలించాలని ఆలోచనలు చేసినా.. అప్రకటిత కారణాలతో మళ్లీ కొలంబోలోనే మ్యాచులు నిర్వహించారు. వర్షం ఎన్ని రకాలుగా అంతరాయాలు కలిగించినా, మ్యాచులు సజావుగా పూర్తి చేసేందుకు సహకరించిన గ్రౌండ్ సిబ్బందికి ప్రైజ్ మనీ ప్రకటించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ).
‘క్రికెట్ అన్‌సంగ్ హీరోస్‌కి పెద్ద ప్రమాణం. ఆసియా క్రికెట్ కౌన్సిల్, శ్రీలంక క్రికెట్ బోర్డు కలిసి సగర్వంగా 50 వేల డాలర్లు (41 లక్షల 54 వేల రూపాయలకు పైగా) ప్రైజ్‌మనీని క్యూరెటర్స్, గ్రౌండ్‌మెన్‌కి అందిస్తున్నాం.
వీరి అచంచలమైన నిబద్ధత, కృషి వల్లే ఆసియా కప్ 2023 టోర్నీ ఇంత పెద్ద సక్సెస్ అయ్యింది. పిచ్‌ని సిద్దం చేయడం దగ్గర్నుంచి ఆటంకం లేకుండా పూర్తి అయ్యేదాకా ఎంతో కష్టపడ్డారు. మీ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడం మా బాధ్యత..’ అంటూ ట్వీట్ చేశాడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, బీసీసీఐ సెక్రటరీ జై షా..
పల్లెకెలేలో నేపాల్- ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌కి వర్షం ఆటంకం జరిగినా సజావుగా పూర్తి అయ్యింది. ఇండియా- పాకిస్తాన్ మధ్య జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది.
భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత భారీ వర్షం కురిసింది. వర్షం తగ్గడం, గ్రౌండ్ స్టాఫ్ ఆటకు అంత సిద్ధం చేయడం... మళ్లీ వాన పడడం, ఆట వాయిదా పడడం ఇలా మూడు సార్లు జరిగింది. చివరికి ఆట నిర్వహణ సాధ్యం కాదని మ్యాచ్‌ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు..
ఈ మ్యాచ్ కారణంగానే సూపర్ 4 రౌండ్‌లో ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌కి రిజర్వు డే కేటాయించింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. అనుకున్నట్టుగానే ఇండియా - పాక్ సూపర్ 4 మ్యాచ్ రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సాగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌కి చాలా సార్లు అంతరాయం కలిగింది..
చినుకులు పడగానే గ్రౌండ్ స్టాఫ్ కవర్లతో క్రీజులోకి రావడం, వర్షం తగ్గిన తర్వాత కవర్లను తొలగించి, గ్రౌండ్‌ని ఆటకు సిద్ధం చేయడం... చిత్తడిగా మారిన అవుట్ ఫీల్డ్‌ని ఆరబెట్టడం... ఇలా ఆసియా కప్ 2023 టోర్నీకి సక్సెస్‌ని చేయడానికి ఎంతగానో శ్రమించింది గ్రౌండ్ స్టాఫ్ మాత్రమే..