ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీ... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీని దృష్టిలో పెట్టుకుని టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ నిర్వహణ... 

వివిధ కారణాల వల్ల నాలుగేళ్ల నిర్వహించలేకపోయిన ఆసియా కప్‌ టోర్నీ, ఈ ఏడాది తిరిగి ప్రారంభం కానుంది. శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ అసోసియేషన్ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. ప్రతీ రెండేళ్లకోసారి ఆసియా కప్ నిర్వహించాలని భావించినా... కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఆసియా కప్ టోర్నీ రద్దయ్యింది...

2021 జూన్‌ నెలలో ఆసియా కప్ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసినా, సెకండ్ వేవ్, భారత జట్టు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించిన కారణంగా అప్పుడు కూడా టోర్నీ నిర్వహణ సాధ్యం కాలేదు. ఈ సారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ టోర్నీ జరగనుంది. ఇప్పటిదాకా 14 సార్లు ఆసియా కప్ నిర్వహించగా భారత జట్టు 7 సార్లు గెలిచి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా నిలిచింది...

శ్రీలంక జట్టు ఐదు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలవగా, పాకిస్తాన్ రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లతో పాటు మరో జట్టు ఆసియా కప్ టోర్నీ ఆడనుంది. యూఏఈ, కువైట్ మధ్య జరిగే క్వాలిఫైయర్ టోర్నీలో గెలిచిన జట్టుకి ఆసియా కప్ టోర్నీ ఆడే అవకాశం దక్కుతుంది...

ఆగస్టు 20 నుంచి క్వాలిఫైయర్స్ మ్యాచులు ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కంటే ముందుగానే ఆసియా కప్ టీ20 టోర్నీలో దాయాదుల పోరు చూసే అవకాశం దక్కనుంది...

ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఏసీసీ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2024లో జరిగే వార్షిక సమావేశం వరకూ జై షా, ఏసీసీ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతారు. అలాగే ఇన్ని రోజులు ఆసియా క్రికెట్ అసోసియేషన్‌లో అసోసియేట్ మెంబర్‌గా ఉన్న ఖతర్ క్రికెట్ అసోసియేషన్‌కి శాశ్వత సభ్యత్వాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది కౌన్సిల్...

1984లో యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభమైంది. తొలుత వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ నిర్వహించగా, 2015లో వన్డే, టీ20 ఫార్మాట్లలో ఈ టోర్నీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. రాబోయే ఐసీసీ ఈవెంట్‌ ఫార్మాట్‌ని బట్టి ఆసియా కప్ ఫార్మాట్‌ని నిర్ణయిస్తారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ సారి టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ జరుగుతుంది...

1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018 సీజన్లలో టీమిండియా ఆసియా కప్ టైటిల్‌ను గెలవగా 1986, 1997, 2004, 2008, 2014 సీజన్లలో శ్రీలంకకి టైటిల్ దక్కింది. 2000వ సంవత్సరంలో తొలిసారి ఆసియా కప్ గెలిచిన పాకిస్తాన్, 2012లో చివరిగా గెలిచింది.

వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ జరగనుండడంతో పాకిస్తాన్ వేదికగా వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని షెడ్యూల్ చేసింది ఆసియా క్రికెట్ కౌన్సిల్. అయితే భారత జట్టు, ఆసియా కప్ 2023 టోర్నీ ఆడేందుకు పాకిస్తాన్ వెళ్తుందా? అనేది అనుమానంగా మారింది.