ప్రతిష్టాత్మక యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టీవ్ స్మిత్ కేవలం ఒక్క ఇన్నింగ్స్ కు దూరమైతేనే ఆసిస్ ఓటమి అంచుల్లో నిలిచి చివరకు చావుతప్పి డ్రాతో ముగించుకుంది. అలాంటిది అతడు ఓ టెస్ట్ మొత్తానికి దూరం కానున్నాడు. గాయంతో రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ కు దూరమైన స్మిత్ మూడో టెస్ట్ కు పూర్తిగా దూరమవుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ మేరకు అధికారకంగా ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఏడాది నిషేదం తర్వాత బరిలోకి దిగిన మొదటి టెస్ట్ లోనే స్మిత్ అదరగొట్టాడు. వరుస ఇన్నింగ్సుల్లో సెంచరీలతో చెలరేగి ఒకే టెస్టులో రెండు సెంచరీలు నమోదుచేశాడు. సహచరులంతా విఫలమైన పిచ్ పై అతడొక్కడే ఒంటిచేత్తో ఆసిస్ జట్టును గెలిపించాడు. అయితే ఆ తర్వాత లార్డ్స్ వేదికన జరిగిన రెండో టెస్ట్ లో అతన్ని విధి వెక్కింరించింది.

రెండో టెస్ట్ లోనూ స్మిత్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అయితే సెంచరీ వైపు సాగిస్తున్న సమయంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. స్మిత్ 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా జోప్రా ఆర్చర్ బౌలింగ్ లో గాయపడ్డాడు. ఆర్చర్ విసిరిన బంతి 149కిమి వేగంతో స్మిత్ మెడపై తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడి మైదానంలోనే కుప్పకూలాడు. ప్రథమ చికిత్స అనంతరం రిటైర్ట్ హట్ గా మైదానాన్ని వీడాడు. కాస్సేపటి తర్వాత మళ్లీ  బ్యాటింగ్ వచ్చినా మునుపటి జోరు కొనసాగించలేకపోయాడు.దీంతో 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. 

అయితే ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో అతడు బ్యాటింగ్ కు రాలేదు. అతడి స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ గా మార్నస్ లబుషేన్ బరిలోకి దిగాడు. ఇలా స్మిత్ ఒక్క ఇన్నింగ్స్ ఆడకపోయేసరికి ఆసిస్ చివరిరోజు ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే లబుషేన్ సమయస్పూర్తితో బ్యాటింగ్ చేసి మ్యాచ్ డ్రాగా ముగిసేలా చేశాడు. అలాంటిది స్మిత్  ఓ మ్యాచ్ మొత్తానికి దూరమవడం ఖచ్చితంగా ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీసే అంశమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

మూడో టెస్ట్  కోసం సన్నద్దమవుతున్న జట్టులో కలిసి స్మిత్ ఇవాళ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. అయితే అతడి మెడ నొప్పి ఇంకా తగ్గనట్లుగా గుర్తించిన ఆస్ట్రేలియా టీం మేనేజ్ మెంట్ తమ బోర్డుకు సమాచారం అందించింది. దీంతో హెడింగ్లీలో జరిగే మూడో టెస్టు నుండి స్మిత్ కు విశ్రాంతినిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. అతడి స్థానంలో లబుషేన్ కొనసాగే అవకాశాలున్నాయి.