Scott Boland: ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్సీ తర్వాత గిరిజన తెగకు చెందిన ఆటగాడు బోలాండే.  శ్వేత జాతి ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఆసీస్ లో ఎన్నో అడ్డంకులు అధిగమిస్తూ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ లో భాగంగా మెల్బోర్న్ లో రెండున్నర రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. 68 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఆసీస్ జయకేతనం ఎగురవేసింది. అయితే ఇంగ్లాండ్ వెన్ను విరిచిన ఆసీస్ పేస్ దళంలో కీలక బౌలర్ స్కాట్ బోలాండ్. అతడికి ఇదే అరంగ్రేట టెస్టు. కానీ అతడు మాత్రం ఎంతో అనుభవమున్న బౌలర్ లా నిప్పులు చెరిగాడు. నాలుగు ఓవర్లు వేసిన బోలాండ్.. ఏడు పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. బోలాండ్ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.

ఆస్ట్రేలియాలోని విక్టోరియాకు చెందిన బోలాండ్.. ఓ స్థానిక ఆదివాసీ తెగకు చెందిన ఆటగాడు. గులిడ్జాన్ తెగలో జన్మించిన బోలాండ్.. ఆసీస్ లో ఈ తెగ తరఫున దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తొలి క్రికెటర్. అంతేగాక ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్సీ తర్వాత గిరిజన తెగకు చెందిన ఆటగాడు బోలాండే. శ్వేత జాతి ఆధిపత్యం ఎక్కువగా ఉండే ఆసీస్ లో ఎన్నో అడ్డంకులు అధిగమిస్తూ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 

ఆసీస్ తరఫున ఆడిన గిరిజన తెగకు చెందిన ఆ దేశపు ఆటగాళ్లు : బోలాండ్, గిలెస్పీ, ఫేత్ థామస్, అశ్లేగ్ గార్డ్నర్ 

32 ఏండ్ల బోలాండ్.. దేశవాళీ క్రికెట్ లో 80 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాడు. 279 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అదరగొడుతున్న అతడు.. యాషెస్ లో అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 

Scroll to load tweet…

అరంగ్రేట టెస్టులోనే అత్యంత వేగవంతంగా 5 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్ గా అతడు రికార్డులకెక్కాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా మూడో టెస్టులోని రెండో ఇన్నింగ్స్ లో అతడు 6 వికెట్లు తీశాడు. దీంతో.. ఆసీస్ బౌలర్ ఎర్నీ తోషాక్, ఇంగ్లాండ్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్ రికార్డులను సమం చేశాడు. 1947లో తోషాక్.. భారత్ పై ఈ ఘనత సాధించాడు. 2015లో బ్రాడ్.. ఆసీస్ పై అత్యంత వేగవంతంగా 5 వికెట్లను తీశాడు. 

టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 5 వికెట్లు తీసిన బౌలర్లు : 

- ఎర్నీ తోషాక్.. 19 బంతుల వ్యవధిలో 5 వికెట్లు (భారత్ పై 1947 బ్రిస్బేన్ లో) 
- స్టువర్ట్ బ్రాడ్.. 19 బంతుల వ్యవధిలో 5 వికెట్లు (ఆసీస్ పై 2015 నాటింగ్ హోమ్ లో)
- స్కాట్ బోలాండ్.. 19 బంతుల వ్యవధిలో 5 వికెట్లు (ఇంగ్లాండ్ పై 2021 మెల్బోర్న్ లో)

ఈ మ్యాచులో 4 ఓవర్లు వేసిన బోలాండ్.. తొలి రెండు బంతులకు పరుగులేమీ ఇవ్వలేదు. మూడో బంతికి వికెట్.. మళ్లీ ఐదో బంతికి వికెట్ సాధించాడు. ఆ తర్వాత రెండు బంతులు సింగిల్స్ రాగా.. తొమ్మిదో బంతికి 3 పరుగులిచ్చాడు. ఆ తర్వాత బంతికే మళ్లీ వికెట్. ఇక చివరి 12 బంతుల్లో 2 పరుగులే ఇచ్చి మరో వికెట్లు తీశాడు. 

Scroll to load tweet…

అంతేగాక.. డెబ్యూ మ్యాచులోనే ఆసీస్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్ బోలాండ్. బోలాండ్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు తీయగా.. అంతకుముందు 1895లో అల్బర్ట్ ట్రాట్ (8-43), 1877 లో టామ్ కెండల్ (7-55) లు ఈ రికార్డు ఫీట్ సాధించారు. 

నమ్మేలా లేదు : బోలాండ్ 

అరంగ్రేట మ్యాచులోనే అదరగొట్టడంపై బోలాండ్ స్పందిస్తూ.. ‘దీన్ని నమ్మలేకపోతున్నా. ఈ రోజు మేం గెలుస్తామని తెలుసు. కానీ ఇంత త్వరగా గెలుస్తామని మాత్రం ఊహించలేదు. ఇప్పటిదాకా నేనాడిన అన్ని మ్యాచులలో ఇదే అతి పెద్ద ప్రదర్శన. ఇది అంత తేలికైంది కాదని నాకు తెలుసు. అభిమానులకు ధన్యవాదాలు..’ అని చెప్పుకొచ్చాడు.