ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్న పాక్ క్రికెట్ బోర్డు... పాకిస్తాన్ పాప్ సింగర్ అతిఫ్ అస్లాం, ఏఆర్ రెహ్మాన్‌తో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ న్యూస్..
ఆసియా కప్ 2023 టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఆగస్టు 30న పాకిస్తాన్‌లోని ముల్తాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభం కానుంది. కొన్ని దశాబ్దాల తర్వాత పాకిస్తాన్‌లో జరుగుతున్న మల్టీ నేషనల్ క్రికెట్ టోర్నీ ఇదే..
దీంతో ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది పాక్ క్రికెట్ బోర్డు. ఆసియా కప్ ఆరంభ వేడుకల్లో పాకిస్తాన్ పాప్ సింగర్ అతిఫ్ అస్లాంతో మ్యూజికల్ ప్రోగ్రామ్ చేయించాలని పీసీబీ ప్రయత్నిస్తోంది. అలాగే ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్లో ఆస్కార్ విన్నింగ్ భారత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కూడా పాల్గొనబోతున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
అయితే పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్లో పాల్గొనే సాహసం, ఏఆర్ రెహ్మాన్ చేయకపోవచ్చు. అదీకాకుండా ఏఆర్ రెహ్మాన్ ప్రస్తుతం లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో లైవ్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉన్నాడు. 2014 టీ20 వరల్డ్ కప్‌తో ఐపీఎల్‌లో చాలాసార్లు ఏఆర్ రెహ్మాన్ లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే ఇండియాలో జరిగిన క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొనడం వేరు, పాకిస్తాన్‌లో ప్రోగ్రామ్ చేయడం వేరు.
హాలీవుడ్ లెవెల్లో పాపులారిటీ దక్కించుకున్న ఏఆర్ రెహ్మాన్, పాకిస్తాన్‌లో అడుగుపెడితే అది సంచలన వార్తే అవుతుంది. అన్నింటికీ మించి ఓ లైవ్ ప్రోగ్రామ్‌కి ఏఆర్ రెహ్మాన్ తీసుకునే కోట్ల మొత్తాన్ని చెల్లించే పొజిషన్‌లో అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేదు. కాబట్టి ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్లో ఏఆర్ రెహ్మాన్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడనే వార్త, ఫేక్ న్యూస్ మాత్రమే..
ఆసియా కప్ 2023 ఆరంభ వేడుకల్లో కాకపోయినా, వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభ వేడుకల్లో ఏఆర్ రెహ్మాన్ ప్రోగ్రామ్ ఉండే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడబోయే 10 జట్ల కెప్టెన్లు, అక్టోబర్ 4న అహ్మదాబాద్‌లో జరిగే ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు.
అక్టోబర్ 4న వరల్డ్ కప్ ట్రోఫీతో కెప్టెన్ల ఫోటోషూట్ నిర్వహించనుంది ఐసీసీ. ఈ ఫోటోషూట్ అనంతరం భారీ స్థాయిలో 2023 వన్డే వరల్డ్ కప్ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది బీసీసీఐ. బాలీవుడ్ హీరో, హీరోయిన్లతో డ్యాన్స్ ప్రోగ్రామ్, ఏఆర్ రెహ్మాన్‌తో లైవ్ మ్యూజిక్ షో వంటివి వన్డే వరల్డ్ కప్ 2023 ఆరంభ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారబోతున్నాయి..
ప్రస్తుతం 11 సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు ఏఆర్ రెహ్మాన్. హిందీలో మూడు సినిమాలతో పాటు తమిళ్, మలయాళం, తెలుగులోనూ సినిమాలు చేస్తాడు. రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి కూడా ముందు ఏఆర్ రెహ్మాన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా రెహ్మాన్ ప్లేస్‌లోకి థమన్ వచ్చాడు. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేయబోయే సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు.
