Anushka Sharma's Chakda Xpress Teaser: రెండు దశాబ్దాలుగా భారత మహిళల క్రికెట్ కు ఎనలేని సేవలు చేస్తున్న టీమిండియా వెటరన్ జులన్ గోస్వామి జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న ‘చక్దా ఎక్స్ప్రెస్’ టీజర్ విడుదలైంది.
భారత మహిళల క్రికెట్ జట్టులో లెజెండ్, టీమిండియా మాజీ సారథి జులన్ గోస్వామి జీవిత చరిత్రపై బయోపిక్ తెరకెక్కుతున్నది. టీమిండియ పురుషుల జట్టు సారథి విరాట్ కోహ్లి భార్య Anushka Sharma ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘చక్దా ఎక్స్ప్రెస్’ (Chakda Xpress Teaser) టీజర్ విడుదలైంది. ఈ సినిమాలో అనుష్క శర్మ..Jhulan goswami పాత్రను పోషిస్తున్నది. Netflix లో విడుదల కాబోతున్న ఈ సినిమాను అనుష్క శర్మతో పాటు ఆమె సోదరుడు కర్నేశ్ శర్మ కలిసి నిర్మిస్తున్నారు.
ఒక నిమిషం మూడు సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్.. ఆస్ట్రేలియా-ఇండియా మ్యాచ్ తో ప్రారంభమైంది. భారత మహిళల జట్టు ఆటగాళ్లకు కనీసం జెర్సీలు కూడా లేని రోజుల్లో పురుషుల క్రికెటర్ల జెర్సీల స్థానంలో స్టిక్కర్లు అంటించి వాటిమీద మహిళా క్రికెటర్ల పేర్లు రాయడం.. ఈ మ్యాచుకు ప్రేక్షకులు ఎవరూ లేకపోవడం వంటివి ఇందులో చూపించారు.
ముఖ్యంగా ఈ సినిమాలో జులన్ గోస్వామి.. కెరీర్ ప్రారంభంలో ఎదుర్కున్న ఇబ్బందులు, పురుషుల ఆధిపత్యం సాగుతున్న భారత క్రికెట్ లో స్త్రీ ద్వేషపూరిత రాజకీయాలను ఆమె ఎలా ఎదుర్కున్నది..? వాటన్నింటినీ తట్టుకుని ఎలా నిలబడగలిగింది..? అనే పలు అంశాలను ఇందులో చూపించనున్నారు.

అనుష్క శర్మ, కర్నేశ్ శర్మ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రొసిత్ రాయ్ దర్శకత్వం వహించారు. అతి త్వరలోనే ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లాలో ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. మహిళల క్రికెట్ పై అంతగా క్రేజ్ లేని రోజుల్లోనే దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆమె.. 39 ఏండ్ల వయసులోనూ క్రికెట్ ఆడుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. గురువారం ప్రకటించిన ఐసీసీ మహిళల ప్రపంచకప్ -2022 జట్టులో కూడా ఆమె పేరు ఉంది. 2002 నుంచి ఆమె దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నది.
కాగా ఈ చిత్రంపై అనుష్క శర్మ మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఇది త్యాగానికి సంబంధించిన కథ. భారత మాజీ కెప్టెన్ జులన్ గోస్వామి జీవితం, కెరీర్ లో ఆమె ఎదుర్కున్న ఎత్తు పల్లాలు, ఇతరత్రా అంశాల నుంచి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో ఇది ఒక ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది. అంతేగాక ఒక మహిళగా దేశానికి ప్రాతినిథ్యం వహించడమేగాక విశ్వ వేదికపై తన దేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన గొప్ప క్రికెటర్ జులన్ గోస్వామి...’ అని తెలిపింది.
ఇక భారత జట్టు తరఫున 12 టెస్టులు, 192 వన్డేలు, 68 టీ20లు ఆడిన జులన్ గోస్వామి.. టెస్టులలో 44 వికెట్లు తీసింది. వన్డేలలో 240 వికెట్లు పడగొట్టింది. టీ20లలో 56 వికెట్లు దక్కించుకుంది. బ్యాటర్ గా టెస్టులలో ఒకటి, వన్డేలలో ఒక అర్థ సెంచరీ సాధించింది. వన్డేలలో ఆమె 1,162 పరుగులు చేసింది. ప్రపంచ మహిళల క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ల జాబితాలో గోస్వామి అగ్రస్థానంలో ఉంది.
