అన్‌మోల్‌ప్రీత్ సింగ్ సెంచరీ! సయ్యద్ మోదీ ముస్తాక్ ఆలీ ట్రోఫీ విజేతగా పంజాబ్..

SMAT 2023: 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 113 పరుగులు చేసిన అన్‌మోల్‌ ప్రీత్ సింగ్.. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన అర్ష్‌దీప్ సింగ్.. 

Anmolpreet Singh Century, Punjab wins Syed Mushtaq Ali T20 first time CRA

దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 ట్రోఫీని పంజాబ్ కైవసం చేసుకుంది. ఐదోసారి ఫైనల్ చేరిన పంజాబ్, మొట్టమొదటిసారి టైటిల్ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. 

అభిషేక్ శర్మను ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ చేశాడు సోయెబ్ సోపరియా. ప్రభుసిమ్రాన్ సింగ్ 9 పరుగులు చేసి అవుట్ కావడంతో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది పంజాబ్. కెప్టెన్ మన్‌దీప్ సింగ్ 23 బంతుల్లో 4 ఫోర్లతో 32 పరుగులు చేయగా అన్‌మోల్‌ ప్రీత్ సింగ్ 61 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 113 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు..

నేహాల్ వదేరా 27 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేయగా ఇన్నింగ్స్ ఆఖరి బంతిని ఎదుర్కొన్న సన్వీర్ సింగ్ ఫోర్ బాదాడు. 

224 పరుగుల లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన బరోడా జట్టు, 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. జ్యోస్నిల్ సింగ్ 4 పరుగులు చేయగా నినద్ రత్వా 22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.

అభిమన్యు సింగ్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేయగా కెప్టెన్ కృనాల్ పాండ్యా 32 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 45 పరుగులు చేశాడు. విష్ణు సోలంకి 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు..

సిద్ధార్థ్ కౌల్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 6, 4, 4, 4, 6 బాదిన విష్ణు సోలంకి 24 పరుగులు రాబట్టాడు. బరోడా విజయానికి 12 బంతుల్లో 33 పరుగులు కావాల్సినప్పుడు అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది..

తొలి బంతికి కృనాల్ పాండ్యా అవుట్ కాగా రెండో బంతికి శివలిక్ శర్మ కూడా అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో భాను పూనియా కూడా అవుట్ అయ్యాడు. 19వ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. దీంతో చివరి ఓవర్‌లో బరోడా విజయానికి 29 పరుగులు కావాల్సి వచ్చాయి..

మూడో బంతికి విష్ణు సోలంకిని హర్‌ప్రీత్ బ్రార్ అవుట్ చేయడంతో బరోడా కథ ముగిసింది. టోర్నీలో 485 పరుగులు చేసి, 2 వికెట్లు తీసిన అభిషేక్ శర్మ, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గెలవగా, అన్‌మోల్‌ప్రీత్ సింగ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios