ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఆడుతున్నా ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీల్లో మాత్రం నిరాశపరుస్తోంది. ఇటీవల ముగిసిన ప్రపంచ కప్, అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలనూ గెలుచుకోవడంలో కోహ్లీసేన విఫలమయ్యింది. అయితే ఈ టోర్నీల్లో భారత ఆటగాళ్లు రాణిస్తున్నా జట్టు మాత్రం గెలవలేకపోతోంది. ఇందుకు  అంతర్జాతీయ క్రికెట్లో అనుభవంలేని సెలెక్షన్ కమిటీ ఆటగాళ్ళ ఎంపికను చేపట్టడమే కారణమని విమర్శలు వెల్లువెత్తున్నాయి.అందువల్ల ఇప్పుడున్న సెలెక్టర్లను తొలగించి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు సెలెక్షన్ కమిటీలో చోటివ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కు తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ నుండి మద్దతు లభించింది.   

టీమిండియా సెలెక్షన్ కమీటిని ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం వుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడున్న సెలెక్టర్లను తొలగించి సీనియర్ క్రికెటర్ అనిల్ కుంబ్లే వంటి సీనియర్ ను చీఫ్ సెలక్టర్ గా నియమించాలని బిసిసిఐకి సూచించాడు. అంతర్జాతీయ క్రికెటర్ అనుభవమున్న ఇలాంటివారే ఏ ఆటగాడు ఏ ఫార్మాట్ కు సరిపోతాడో సరిగ్గా అంచనా వేయగలని సెహ్వాగ్ వెల్లడించాడు. 

ఇక  ప్రస్తుత టీమిండియా సీనియర్లు, మాజీలతో కుంబ్లే  మంచి సత్సంబంధాలను కలిగివున్నాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి మాజీలతో అతడు మంచి అనుబంధాన్ని కలిగివున్నాడు. కాబట్టి ఆటగాళ్ల ఎంపికలో వీరినుండి కూడా సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం వుంటుంది. ఈ  విషయంపై బిసిసిఐ ఆలోచించాలని కోరాడు. 

అయితే కుంబ్లేను చీఫ్ సెలెక్టర్ గా నియమించాలంటే మాత్రం జీతభత్యాలను పెంచాల్సి వుంటుందన్నాడు. ఇప్పటిలాగే సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ కు ఏడాదికి కోటి రూపాయల వేతనం చెల్లిస్తామంటే కుంబ్లే అంగీకరించకపోవచ్చని సెహ్వాగ్ తెలిపాడు.