టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసి నేటికి 22 ఏళ్లు... 1999లో పాకిస్తాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టిన అనిల్ కుంబ్లే... 9 మెయిడిన్లు ఓవర్లు వేసి 74 పరుగులిచ్చి 10 వికెట్లు తీసిన కుంబ్లే...
భారత మాజీ క్రికెటర్, మాజీ టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే... టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసి నేటికి 22 ఏళ్లు. 1999లో పాకిస్తాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో పదికి పది వికెట్లు పడగొట్టాడు అనిల్ కుంబ్లే. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత క్రికెటర్, రెండో క్రికెటర్‌గా నిలిచాడు అనిల్ కుంబ్లే. 1956లో ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేఖర్ మాత్రమే ఇంతకుముందు ఈ ఫీట్ సాధించాడు.
పాకిస్తాన్‌తో ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో 420 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది టీమిండియా. పాక్ ఓపెనర్లు షాహిద్ ఆఫ్రీదీ, సయ్యద్ అన్వర్ మొదటి వికెట్‌కి 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, శుభారంభం అందించారు. ఆ తర్వాత అనిల్ కుంబ్లే మ్యాజిక్ మొదలైంది.
41 పరుగులు చేసిన ఆఫ్రిదీని అవుట్ చేసిన కుంబ్లే, ఆ తర్వాతి బంతికే ఇయాజ్ అహ్మద్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇంజమామ్ వుల్ హక్, మహ్మద్ యూసఫ్ ఒక్క బాల్ తేడాతో అవుట్ కాగా... ముస్తాక్ అహ్మద్, సక్‌లెన్ ముస్తాక్ వెంటవెంటనే బంతుల్లో అవుట్ అయ్యారు.
మొత్తంగా 26.3 ఓవర్లు బౌలింగ్ చేసిన అనిల్ కుంబ్లే.. 9 మెయిడిన్లు ఓవర్లు వేసి 74 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఫలితంగా వికెట్ కోల్పోకుండా 101 పరుగులు చేసిన పాక్, 207 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 212 పరుగుల భారీ విజయం దక్కింది కుంబ్లే ఫీట్ 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వీడియో ట్వీట్ చేసింది బీసీసీఐ.
