కారు ప్రమాదానికి గురైన సమయంలో ఆండ్రూ సైమండ్స్‌తో పాటు కారులో రెండు పెంపుడు కుక్కలు... డెడ్‌ బాడీ నుంచి కదలకుండా పోలీసులను అడ్డుకున్న ఓ కుక్క...

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్... శనివారం రాత్రి క్వీన్‌లాండ్స్‌లో జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అతి వేగంగా వెళ్తున్న కారు, డివైడర్‌ని ఢీకొట్టి బోల్తాపడడంతో కారులో ఉన్న ఆండ్రూ సైమండ్స్... తీవ్ర గాయాలతో ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు...

అయితే ప్రమాదానికి గురైన సమయంలో ఆండ్రూ సైమండ్స్ కారులో అతనితో పాటు అతని పెంపుడు కుక్కలు కూడా ఉన్నాయని తెలిసింది. ఆండ్రూ సైమండ్స్‌కి కుక్కలంటే బాగా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా తన పెంపుడు కుక్కలను వెంట తీసుకుని వెళ్లేవాడట సైమండ్స్...

శనివారం రాత్రి కూడా సైమండ్స్‌ కారు ప్రమాదానికి గురైన సమయంలో అతని కారులో రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. ఈ విషయాన్ని క్వీన్స్‌ల్యాండ్ పోలీసులు తెలియచేశారు. ‘ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదానికి గురైన సమయంలో అతనితో పాటు కారులో రెండు కుక్కలు కూడా ఉన్నాయి. అయితే అదృష్టవశాత్తు వాటికి ఏమీ కాలేదు.

సైమండ్స్‌ని ఆ స్థితిలో చూసిన ఓ కుక్క, అతని డెడ్‌బాడీని వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఎంత లాగడానికి ప్రయత్నించినా, అక్కడి నుంచి కదల్లేదు... లాక్కెళ్లడానికి ప్రయత్నించిన ప్రతీసారి మమ్మల్ని చూసి మొరుగుతోంది, దగ్గరికి కూడా రానివ్వలేదు... ఎలాగోలా అతి కష్టం మీద వాటిని పక్కకు తీసుకెళ్లాం.. ఆ మూగజీవుల రోదన చూసి మా గుండె తడుక్కుపోయింది. ’ అంటూ తెలియచేశాడు క్వీన్స్‌లాండ్ పోలీసు అధికారి...

శనివారం రాత్రి క్వీన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో 46 ఏళ్ల ఆండ్రూ సైమండ్స్... అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి, సైమండ్స్ ప్రాణాలు కాపాడడానికి శత విధాలా ప్రయత్నించాడట...

‘నా కళ్ల ముందే కారు యాక్సిడెంట్‌కి గురైంది. కారులో ఇరుక్కుపోయిన అతన్ని, బయటికి లాగడానికి చాలా ట్రై చేశా. ఆ సమయంలో అక్కడ నేనొక్కడినే ఉండడంతో బయటికి తీయడానికి కాస్త సమయం పట్టింది. వెంటనే సీపీఆర్ చేయడం మొదలెట్టాను. అతని పల్స్ చెక్ చేశా. అయితే అతను నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఆ సమయంలో కారులో ఉన్నది క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ అనే విషయం కూడా నాకు తెలీదు...’ చెప్పుకొచ్చాడు కారు ప్రమాదానికి ప్రత్యక్ష సాక్షిగా మారిన విల్సన్ టౌన్సన్ అనే స్థానిక వ్యక్తి...

ఆండ్రూ సైమండ్స్ కారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆండ్రూ సైమండ్స్‌ని బతికించడానికి శాయశక్తులా ప్రయత్నించాయి. అయితే అప్పటికే ఆండ్రూ సైమండ్స్ ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది...

అయితే అతి వేగంగా దూసుకెళ్తున్న ఆండ్రూ సైమండ్స్ కారు, ఉన్న పళంగా బోల్తా కొట్టడానికి ముందు రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టింది. సైమండ్స్ కారు డివైడర్‌ ఢీకొట్టడానికి కారణం ఏంటి? ఎవరైనా అడ్డుగా వచ్చారా? లేక సడెన్‌గా కారు కంట్రోల్ తప్పిందా? లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాలు తెలియరాలేదని క్వీన్స్‌లాండ్ పోలీసులు మీడియాకి తెలియచేశారు.