బిసిసిఐ అనుబంధ క్రికెట్ సంఘాల్లో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు మాత్రం ఎన్నికలు జరగడంలేదు. ఎన్నికల ప్రక్రియ అవసరం లేకుండానే ఏసీఏ కార్యవర్గం ఏర్పాటయ్యింది. అధ్యక్ష పదవితో సహా మిగతా అన్ని పదవులకు కేవలం ఒక్కో అభ్యర్థే నామినేషన్ దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. దీంతో వారికే ఆ పదవులు కట్టబడుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. 

ఏసిఏ నూతన అధ్యక్షుడిగా పి. శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా యాచేంద్ర నియమితులయ్యారు. అలాగే కార్యదర్శిగా దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా రామచంద్రారావు, కోశాధికారిగా గోపీనాథ్ రెడ్డి, కౌన్సిలర్ గా ధనుంజయ్ రెడ్డి లు ఏకగ్రీవమయ్యారు. ఈ నూతన కార్యవర్గం అతి త్వరలో సమావేశమవనున్నట్లు సమాచారం. 

అయితే మరో తెలుగు క్రికెట్ అసోసియేషన్ హెచ్‌సీఏ పదవుల కోసం మాత్రం చాలామంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఆరు పదవుల కోసం 62 మంది మొదట నామినేషన్లు దాఖలు చేయగా చివరకు 17 మంది మాత్రమే చివరి పోటీలో నిలిచారు. అధ్యక్ష పదవికి మాజీ టీమిండియా కెప్టెన్ అజారుద్దిన్ తో పాటు దీలిప్ కుమార్,  ప్రకాష్‌చంద్ జైన్‌ లు పోటీ పడుతున్నారు. మిగతావారంతా వివిధ పదవుల కోసం పోటీలో నిలిచారు. తుది పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారి వీ.ఎస్.సంపత్ ప్రకటించారు.