ముంబై: టీమండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతుల కూతురిపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అనుష్క శర్మ కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా ట్విటర్, ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. దీంతో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా, అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మన క్రికెట్ జట్టు సభ్యులంతా కలిసి భవిష్యత్తులో మహిళల క్రికెట్ జట్టును తాయరు చేస్తారని అమితాబ్ ట్వీట్ చేశారు. మన క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ ఆయన వరుసగా అందరి పేర్లూ రాసుకుంటూ వెళ్లారు. 

ధోనీ కూతురు ఈ జట్టుకు కెప్టెన్ గా ఉంటుందేమోనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జాబితాలో వరుసగా సురేష్ రైనా, గుంభీర్, రోహిత్ శర్మ, షమి, రహానే, జడేజా, పుజారా, సాహా, భజ్జీ, నటరాజన్, ఉమేష్ యాదవ్ ల పేర్లను ఆయన ప్రస్తావించారు. 

తాజాగా విరాట్ కోహ్లీకి కూడా కూతురే పుట్టిందని, వీరంతా కలిసి భారత మహిళల క్రికెట్ జట్టు తయారవుతుందేమోనని అమితాబ్ వ్యాఖ్యానించారు. అమితాబ్ ట్వీట్ మీద నెటజన్లు సరదా స్పందిస్తున్నారు. 

 

తనకు కూతురు పుట్టిన విషయాన్ని అందరితో పంచుకున్న విరాట్ కోహ్లీ తన కూతురి ఫొటోను మాత్రం పంచుకోలేదు. దీంతో ఆయన కూతురు ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. కాగా, కోహ్లీ సోదరుడు వికాస్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోను కోహ్లీ కూతురిగా అందరూ భావించారు. అయితే, ఆమె విరుష్క కూతురు కాదని వికాస్ స్పష్టం చేశాడు. 

తమ కూతురి ఫొటోలు తీయవద్దని కోహ్లీ, అనుష్క కోరుతున్నారు.  తమ ఫోటోలు తీసుకుంటే అభ్యంతరం లేదని, కానీ తమ చిన్నారి ఫొటోలు తీయవద్దని, తమ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని విరాట్ కోహ్లీ అన్నాడు.