ఐసిసి ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించినప్పటి నుండి ఓ వివాదం చెలరేగుతోంది. అదే తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి టీమిండియా జట్టులో చోటు దక్కకపోవడం. అయితే అనుకోకుండా అతడికి ప్రపంచ కప్ జట్టుతో చోటుదక్కే అవకాశాలు  కనిపిస్తున్నాయి. దీంతో రాయుడు అభిమానులతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రియులు రాయుడికి ప్రపంచ కప్ బెర్తు ఖాయమవ్వాలని కోరుకుంటున్నారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్న ఆటగాడు కేదార్ జాదవ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయం కారణంగా జాదవ్  అర్ధాంతరంగా ఐపిఎల్ కు దూరమవ్వాల్సి  వచ్చింది. అయితే అతడు ప్రపంచ కప్ కోసం టీమిండియా జట్టుతో పాటు ఈ నెల 22న ఇంగ్లాండ్ బయలుదేరాల్సి వుంది. అప్పట్లోపు అతడి గాయం మానకుంటే అతడి స్థానంలో మరో ఆటగాడు  ఇంగ్లాండ్ ప్లైటెక్కనున్నాడు.

అయితే అలా కేదార్ జాదవ్ ప్రపంచ కప్ కు దూరమైతే ఆ స్థానాన్ని అంబటి రాయుడే  భర్తీ చేసే అవకాశాలు  ఎక్కువగా వున్నాయి. ఇదే విషయాన్ని ఓ బిసిసిఐ అధికారి కూడా తెలిపారు. కానీ జాదవ్ ఆల్ రౌండర్ కాబట్టి బౌలింగ్ వీక్ గా వుందనుకుంటే ఆ స్థానాన్ని అక్షర్ పటేల్ తో భర్తీ చేయనున్నారు. కానీ ఆ అవకాశాలు చాలా తక్కువగా...అంబటి రాయుడి వైపే మొగ్గు ఎక్కువగా వుందని సదరు అధికారి స్పష్టం చేశారు.

టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా జాదవ్ ప్రపంచకప్ ఆడటం డౌటే  అన్నట్లు మాట్లాడారు. ఈ నెల 22న ఇంగ్లాండ్ బయలుదేరే ప్లైట్ లో ఎవరైతే ఆటగాళ్లుంటారో వారే ప్రపంచ కప్ ఆడతారంటూ అతడు వ్యాఖ్యానించాడు. దీన్ని బట్టి చూస్తూ రాయుడు ప్రపంచ కప్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.