లంక జట్టుపై ట్రోల్స్ వెల్లువ.. మరో మ్యాచ్ ఓడితే ఆసియా ఛాంపియన్ల గతేంగాను అంటూ..!
ICC T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో నేటి నుంచి ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ తొలి రోజు ఆసక్తికరంగా సాగింది. తొలి మ్యాచ్ లో ఆసియా ఛాంపియన్లైన శ్రీలంకను అనామక జట్టుగా ఉన్న నమీబియా ఓడించింది. యూఏఈ పై నెదర్లాండ్స్ గెలిచింది.
క్వాలిఫై రౌండ్ తో ప్రారంభమైనా టీ20 ప్రపంచకప్ కు తొలి రోజు కావాల్సినంత క్రేజ్ వచ్చింది. తొలి రోజు అర్హత పోటీలలో భాగంగా గ్రూప్-ఏ నుంచి శ్రీలంక-నమీబియా, యూఏఈ-నెదర్లాండ్స్ మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్ లలో నమీబియా.. శ్రీలంకను ఓడించగా, ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్, యూఏఈని ఓడించింది. అయితే యూఏఈ- నెదర్లాండ్స్ మ్యాచ్ పక్కనబెడితే శ్రీలంక - నమీబియా మ్యాచ్ పై సోషల్ మీడియా లో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆసియా ఛాంపియన్లుగా అవతరించిన శ్రీలంక.. నెల రోజులు కూడా తిరగకముందే చెత్త ఆటతో విమర్శల పాలవుతున్నది.
నమీబియా చేతిలో లంక ఓడిపోయాక సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేస్తూ.. ‘ఈరోజు క్రికెట్ ప్రపంచానికి నమీబియా తన పేరును ఘనంగా చాటింది..’ అని ట్వీట్ చేశాడు. వసీం జాఫర్ అయితే ఓ ఫన్నీ మీమ్ తో నమీబియా జట్టుకు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది.
మ్యాచ్ ముగిశాక పలువురు నెటిజన్లు.. ఆసియా కప్ లో లంకేయులు చేసిన ‘నాగిని’డాన్సులకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. ‘ఇప్పుడు చేయండ్రా అబ్బాయిలు నాగిని డాన్సులు’ అంటూ వాటికి కామెంట్స్ పెట్టారు. మరికొందరు లంక హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఫోటోను పెట్టి.. ‘ఇవాళ రాత్రి మీ అందరికీ బెల్ట్ ట్రీట్మెంట్ ఉంటది మీరు రండ్రా..’అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు మీమ్స్ చేశారు. ‘ఆసియా ఛాంపియన్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడారు. ఆ జట్టు తర్వాత నెదర్లాండ్స్, యూఏఈతో మ్యాచ్ లు ఆడాలి. ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఓడినా ఇక అంతే సంగతులు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా అనామక జట్టుగా బరిలోకి దిగి అగ్రశ్రేణి జట్టుగా ఉన్న టీమ్ ను ఓడించిన సందర్భాలలో నమీబియా కూడా చేరింది. ఇదివరకు ఈ జాబితాలో జింబాబ్వే (2007 టీ20 ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాను ఓడించింది), నెదర్లాండ్స్ (2009 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై గెలిచింది), హాంకాంగ్ (2014 టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ పై), అఫ్గానిస్తాన్ (2016 టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ పై) ఉన్నాయి. తాజాగా నమీబియా కూడా లంకను ఓడించి ఆ జాబితాలో చేరింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన నమీబియా.. 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 95 పరుగులే చేసింది. కానీ దు చివరి ఐదు ఓవర్లలో ఆ జట్టు స్కోరు రాకెట్ స్పీడ్ లా పరిగెత్తింది. 30 బంతుల్లో ఆ జట్టు 68 పరుగులు చేసింది. ఆ జట్టులో జాన్ ఫ్రైలింక్ (28 బంతుల్లో 44, 4 ఫోర్లు), స్మిత్ ( 16 బంతుల్లో 31 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో నిర్నీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది.
మోస్తారు లక్ష్య ఛేదనలో లంక బ్యాటింగ్ కకావికలమైంది. బ్యాటింగ్ లో రాణించిన ఫ్రైలింక్ బౌలింగ్ లో కూడా రెండు వికెట్లు తీశాడు. అతడితో పాటు షికొంగొ, స్కాల్ట్జ్, వీస్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా లంక 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. దీంతో నమీబియా 55 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.