Asianet News TeluguAsianet News Telugu

చక్రం తిప్పిన అమిత్ షా, ఐపీఎల్ 2020 వేదిక ఫిక్స్...?

ఐపీఎల్‌2020 నిర్వహణపై ఎట్టకేలకు కొంత స్పష్టత లభించింది. విదేశాల్లో నిర్వహణకు అవకాశం ఉన్నా, స్వదేశంలోనే ఐపీఎల్‌కే బీసీసీఐ మొగ్గుచూపుతుంది. కోవిడ్‌-19 ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ ఒకే వేదికలో నిర్వహించే వీలుంది.

Ahmedabad Motera Stadium To Host IPL 2020?
Author
Ahmedabad, First Published Jul 9, 2020, 4:27 PM IST

ఐపీఎల్ 2020 నిర్వహణ ఖాయంగా కనబడుతున్నప్పటికీ.... ఎక్కడ అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడంలేదు. యూఏఈ, శ్రీలంకల ఎప్పటినుండో ఐపీఎల్ కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చాయి. తాజాగా న్యూజిలాండ్ కూడా ముందుకొచ్చింది. భారత్ లో నిర్వహించాలా, లేదా విదేశాల్లోనే అనేదానిపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతుంది. 

ఇకపోతే... ఐపీఎల్‌2020 నిర్వహణపై ఎట్టకేలకు కొంత స్పష్టత లభించింది. విదేశాల్లో నిర్వహణకు అవకాశం ఉన్నా, స్వదేశంలోనే ఐపీఎల్‌కే బీసీసీఐ మొగ్గుచూపుతుంది. కోవిడ్‌-19 ప్రమాదకర పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్‌ ఒకే వేదికలో నిర్వహించే వీలుంది. ఐపీఎల్‌ ప్రాంఛైజీ నగరాలు ముంబయి, చెన్నై, న్యూఢిల్లీ, హైదరాబాద్‌లలో కరోనా వైరస్‌ మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌ ఒకే వేదికపై నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం, ఆధునాతన మోతెరా స్టేడియం ఐపీఎల్‌2020కి ఆతిథ్యం ఇవ్వబోతుంది!. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌13 కరోనా కారణంగా తొలుత ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది. భారత్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కొనసాగింపుతో ఐపీఎల్‌13ను నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఖర్చే ప్రధాన కారణం... 

భారత్‌లో కోవిడ్‌-19 కేసులు ఏడు లక్షలు దాటేశాయి. అతి త్వరలోనే కేసులు రెట్టింపు ప్రమాద హెచ్చరికలు ఉన్నాయి. కరోనా కారణంగా భారత్‌లో లాజిస్టికల్‌ సమస్యలు తలెత్తనున్నాయి. దీంతో విదేశాల్లో నిర్వహణ ఆలోచన ఉంటే.. మేం సిద్ధంగా ఉన్నామని యు.ఏ.ఈ, శ్రీలంక, న్యూజిలాండ్‌లు బీసీసీఐకి ప్రతిపాదనలు పంపాయి. 2014లో ఐపీఎల్‌ తొలి దశ మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చిన అనుభవంతో యు.ఏ.ఈ రేసులో ముందు కనిపించింది. 

గత్యంతరం లేని పరిస్థితుల్లో విదేశాల్లో నిర్వహిణకు సిద్ధమేనని, అది కొంత ఖర్చుతో కూడిన వ్యవహారంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అన్నారు. ' భారత్‌లో నిర్వహించే పరిస్థితులు లేకపోతే అప్పుడు విదేశాల్లో నిర్వహణకు ఆలోచన చేస్తాం. ఐపీఎల్‌ విదేశాలకు తరలిపోతే.. బోర్డు, ప్రాంఛైజీలపై పెను భారం పడనుంది. మారకం రేటు, కరెన్సీ ఎక్ఛేంజ్‌ రేటుతో భారం పడనుంది. ప్రస్తుతానికి పరిస్థితులను పరిశీలిస్తున్నాం' అని గంగూలీ తెలిపాడు.

ఐపీఎల్‌ ప్రాంఛైజీ నగరాల్లో కరోనా వైరస్‌ విళయ తాండవం చేస్తోంది. దీంతో భారత్‌లో నిర్వహించినా, ఎక్కడ నిర్వహిస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. పక్కపక్కనే మూడు స్టేడియాలు కలిగిన ముంబయి తొలుత ఆతిథ్య నగరంగా కనిపించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబయి ఐపీఎల్‌ ఆతిథ్యానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. 

ఐపీఎల్‌ నగరాలను తోసిపుచ్చి, కొత్తగా బాహుబలి స్టేడియం రేసులోకి వచ్చింది. ' ఐపీఎల్‌లో ప్రధాన ఆతిథ్య నగరాలు ముంబయి, ఢిల్లీ, కోల్‌కత, చెన్నై. కోవిడ్‌-19తో భారత్‌లో నిర్వహణ పరిస్థితిపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సమయంలో ఐపీఎల్‌ నగరాల్లో లీగ్‌ జరుగుతుందని చెప్పలేం. ఇప్పుడు మాముందున్న కొత్త వేదిక అహ్మదాబాద్‌. ఐపీఎల్‌ను అక్కడ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నాం. అహ్మదాబాద్‌ అమోఘమైన స్టేడియం. అహ్మదాబాద్‌లో కచ్చితంగా నిర్వహిస్తామని చెప్పలేను, ఈ సమయంలో ఐపీఎల్‌ భారత్‌లోనే ఉంటుందని చెప్పటం సైతం కష్టమే' అని గంగూలీ పేర్కొన్నాడు.

కరోనా వైరస్‌ సమయంలో ఐపీఎల్‌ వాస్తవ ఫార్మాట్‌ను కొనసాగిస్తూనే.. మ్యాచుల సంఖ్యను కుదించటంపై చర్చ నడుస్తోంది. బీసీసీఐ సైతం అదే ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

'బీసీసీఐ ముందు కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. మొదటిది, అనుకున్న సమయంలో ఐపీఎల్‌ను నిర్వహిస్తామా? లేదా?. రెండోది, ఐపీఎల్‌ను పరిమిత షెడ్యూల్‌లో నిర్వహించటం. టీ20 వరల్డ్‌కప్‌పై పత్రికల్లో వార్తలను చూస్తున్నాను. ఐసీసీ నుంచి అధికారిక సమాచారం లేదు. ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. ఆ నిర్ణయం వెలువడే లోగా ఏదైనా జరగొచ్చు. లాక్‌డౌన్‌ సమయంలో కంటే ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. జనజీవనం మొదలైనా, భయం నీడన బతుకుతున్నాం. ఇప్పుడు మళ్లీ జనజీవనం సాధారణ స్థాయికి రావాల్సిన అవసరం ఉంది. క్రికెట్‌ సైతం పునప్రారంభం కావాలి' అని దాదా అన్నాడు.

ఈ అన్ని పరిస్థితులను చూస్తుంటే.... ఐపీఎల్ అహ్మదాబాద్ లోనే జరిగే ఆస్కారం కనబడుతుంది. అమిత్ షా తనయుడు జయ్ షా చూడబోతుంటే చక్రం బలంగానే తిప్పినట్టున్నాడు. త్వరలో ఇక మోతేరలో ఐపీఎల్ సంరంభం ఆరంభమయ్యేలా కనబడుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios