INDvsAUS: టీమిండియా  వెటరన్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ప్రస్తుతం తన కెరీర్ లోనే అత్యంత క్షీణ దశను ఎదుర్కుంటున్నాడు.   మరీ ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో రాహుల్ భవితవ్యం  ప్రమాదంలో పడింది. 

కొద్దిరోజుల క్రితమే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని వివాహమాడిన టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ప్రస్తుతం బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో ఉన్నాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ మూడో టెస్టు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ టెస్టుకు ముందు రాహుల్.. తన భార్యతో కలిసి ఇండోర్ కు సమీపంలోనే ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్లాడు.

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ లో ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే శివుడికి భస్మా హారతి కార్యక్రమం ఉంటుంది. రాహుల్ - అతియా దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల కాలంలో రాహుల్ ఫామ్ సరిగ్గా లేకపోవడంతో అతడిని ఏ గ్రహం నిలువరిస్తుందో ఏమో గానీ ఈ ఇద్దరూ నవ గ్రహ పూజ కూడా చేశారు.

రాహుల్ - అతియాలు సంప్రదాయ వస్త్రాలు ధరించి పూజలు చేయడం గమనార్హం. పూజా కార్యక్రమాలు ముగిశాక ఇద్దరూ కలిసి నంది హిల్స్ లో చాలాసేపు ధ్యానం చేశారు. ఆ తర్వాత మహాకాళేశ్వర్ ఆలయం చుట్టూ తిరిగారు. ఈ దంపతులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాహుల్ - అతియాలు ఉజ్జయిని ఆలయ సందర్శనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Scroll to load tweet…

రాహుల్ ఇటీవల కాలంలో అత్యంత చెత్త ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కుంటున్నాడు. గతేడాది బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ తో పాటు ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో కూడా రాహుల్ దారుణంగా విఫలమవుతున్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాలో సెంచరీ (సెంచూరియన్) తర్వాత టెస్టులలో రాహుల్ సగటు 15.90గా ఉంది. మరీ ముఖ్యంగా గడిచిన పది ఇన్నింగ్స్ లలో రాహుల్ స్కోరు.. 8, 12, 10, 22, 23, 10, 2, 20, 1 గా ఉంది. 30 పరుగుల మార్కు చేరుకోవడానికి రాహుల్ నానా తంటాలు పడుతున్నాడు. 

Scroll to load tweet…

రాహుల్ వైఫల్యంపై మాజీ క్రికెటర్లు ధ్వజమెత్తుతున్న వేళ బీసీసీఐ కూడా తాజాగా ఆస్ట్రేలియాతో ప్రకటించిన మిగిలిన రెండు టెస్టులకు అతడిని వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. మరోవైపు రాహుల్ ను తప్పించి శుభ్‌మన్ గిల్ ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు మార్చి 1 నుంచి మొదలయ్యే ఇండోర్ టెస్టులో రాహుల్ తుది జట్టులో ఉంటాడా..? ఉన్నా ఆడతాడా..? లేదా..? అన్నది ఆసక్తికరం. ఒకవేళ రాహుల్ గనక మళ్లీ ఛాన్స్ ఇచ్చి ఇండోర్ లో కూడా విఫలమైతే ఇక అతడు ఐపీఎల్ కే పరిమితమవ్వండం తప్ప జాతీయ జట్టులోకి రావడం గగనమే...!