BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)  ఆధ్వర్యంలో నడిచే  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)   ఆటగాళ్ల ఫిట్నెస్ పై వ్యవహరిస్తున్న తీరుపై బోర్డు ఆగ్రహంగా ఉంది.  

టీమిండియాకు గాయాలు కొత్తకాదు. ఇప్పటితో ఆగిపోయేవీ కాదు. కానీ ఇటీవల క్రికెటర్లకు అవుతున్న గాయాలు మాత్రం కావాల్సి చేసుకుంటున్నవా..? లేక అప్పటికే అయి ఉన్నా అవి మానక ముందే మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చి తిరిగి ఒకటి రెండు మ్యాచ్ లు అయ్యాక మళ్లీ గాయం పేరు చెప్పి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) బాట పడుతున్నారా..? తాజాగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కు గాయమవడం ఇదే అనుమానాలను రేకెత్తిస్తుంది. 

భారత్ - ఆస్ట్రేలియా వేదికగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో సభ్యుడిగా ఉన్న శ్రేయాస్ అయ్యర్.. రెండు రోజులు ఫీల్డింగ్ కూడా చేశాడు. కానీ మూడో రోజు మాత్రం శుభమన్ గిల్ అవుట్ అయ్యాక ఐదో స్థానంలో బ్యాటింగ్ కు రాలేదు. గాయం కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో అతడు క్రీజులోకి అడుగుపెట్టలేదు. 

వెన్నునొప్పి గాయం తిరిగి వేధిస్తుండటంతో బీసీసీఐ అతడిని ఆగమేఘాల మీద స్కానింగ్ లు చేయించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు అయ్యర్.. ఈనెల 17 నుంచి మొదలయ్యే వన్డే సిరీస్ (ఆస్ట్రేలియాతో) తో పాటు ఐపీఎల్ లో ఆడేది కూడా అనుమానంగానే ఉంది. అయితే ఆటగాళ్లకు పదే పదే గాయాలు వేధిస్తుండటం మాత్రం బీసీసీఐకి కోపం తెప్పిస్తున్నది. అసలు ఒకసారి గాయమైన ఆటగాడు ఎన్సీఏకు వెళ్లి ఏం చేస్తున్నాడని, వారిని అక్కడి వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్లు ఎలా ట్రీట్ చేస్తున్నారని బీసీసీఐ ఆరా తీస్తున్నట్టు సమాచారం. బుమ్రా విషయంలో జరిగిందే మరో ఆటగాడి విషయంలో జరిగితే మాత్రం.. అసలే వన్డే వరల్డ్ కప్ లక్ష్యంతో సాగుతున్న టీమిండియాకు షాకులు తప్పవని బోర్డు కూడా భావిస్తున్నది. 

సాధారణంగా ఏదైనా గాయమైన ఆటగాడు ఎన్సీఏకు వెళ్లి అక్కడ దానికి సరిపడా చికిత్స తీసుకోవడం, తిరిగి ఫిట్నెస్ సాధించడం వాళ్ల ప్రాథమిక విధి. మరి మన క్రికెటర్లు వీటిని పాటిస్తున్నారో లేదో తెలియదు గానీ అక్కడికి వెళ్లి ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం మాత్రం తరుచూ చూస్తూనే ఉంటాం. శిఖర్ ధావన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్ లు ఇలాంటి వీడియోలు చేయడంలో ముందుంటారు. అయ్యర్ ఇటీవలే ఢిల్లీ టెస్టుకు ముందు ఎన్సీఏలో ఉంటూ ‘కామ్ డౌన్’ పాటకు ధావన్ తో కలిసి స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అయింది.

View post on Instagram

అయితే తాజాగా అయ్యర్ కు గాయం తిరగబెట్టిన తర్వాత బీసీసీఐ.. ఎన్సీఏ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైనట్టు తెలుస్తున్నది. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అవును. ఇది (అయ్యర్ కు గాయమవడం) చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది. ఇది తొలిసారి కాదు. బుమ్రా విషయంలో బీసీసీఐ ఇప్పటికే గుణపాఠం నేర్చుకోవాలి. కానీ అలాంటిది జరగలేదనే అనిపిస్తోంది. శ్రేయాస్ విషయంలో తొందరపడకూడదు. వన్డే సిరీస్ వరకు అతడు ఎలా ఉంటాడో ఇప్పుడే చెప్పలేం..’ అని తెలిపాడు.

ఎన్సీఏ నుంచి ఫిట్నెస్ క్లీయరెన్స్ సర్టిఫికెట్ పొందిన తర్వాతే ఆటగాడు జాతీయ జట్టు సెలక్షన్ కు అందుబాటులో ఉంటాడు. నితిన్ పటేల్ నేతృత్వంలోని ఎన్సీఏ స్పోర్ట్స్ సైన్స్ విభాగం ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో ఏం చేస్తుందని బీసీసీఐ ఆరా తీసినట్టు తెలుస్తున్నది.