IPL 2022: వేలంలో పేరు నమోదు చేసుకుంటారు. తాము అనుకున్న ధర వస్తే ఆడతారు. తేడా వస్తే ఏదో కారణం చెప్పి తప్పుకుంటారు. అసలు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ ను వీడటానికి కారణాలేంటి..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. శక్తినంతా కూడదీసుకుని ఒక్కసారి ఈ సీజన్ లో మెరిస్తే చాలు.. తర్వాత మరో రెండు మూడు సీజన్ల దాకా వేలం ప్రక్రియలో కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ లీగ్ జరిగేది ఇండియాలో అయినా ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉండే క్రేజే వేరు. ఈ లీగ్ లో మెరవాలని చాలా మంది ఆటగాళ్లు తమ దేశ సిరీస్ లను కూడా కాదనుకుని ఐపీఎల్ లో ఆడుతున్నారు. అయితే ఇంగ్లాండ్ క్రికెటర్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వేలానికి మాత్రం పేరిచ్చి.. తీరా లీగ్ కు ముందువరకు ఫ్రాంచైజీలకు హ్యాండ్ ఇస్తున్నారు. ఇందుకు వాళ్లు చెబుతున్న కారణాలు.. కుటుంబం, వ్యక్తిగతం, గాయం.. ఇలా అర్థాంతరంగా ఐపీఎల్ నుంచి వైదొలిగిన వారి జాబితాలో జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్ కు తోడుగా ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వేలంలో భారీ ధరకు దక్కించుకున్న మార్క్ వుడ్ కూడా చేరాడు.
వెస్టిండీస్ తో ఇంగ్లాండ్ టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా బౌలింగ్ చేస్తుండగా మార్క్ వుడ్ కు గాయైమంది. దీంతో అతడు పెవిలియన్ కు వెళ్లాడు. మ్యాచ్ ముగిసినా అతడు మాత్రం మళ్లీ ఫీల్డ్ లోకి రాలేదు. వుడ్ మోచేతికి గాయమైనట్టు సమాచారం. అతడి గాయం తీవ్రమైందేనని, కొన్నాళ్లు విశ్రాంతి అవసరమని తెలుస్తున్నది. ఇది లక్నో సూపర్ జెయింట్స్ కు పెద్ద షాకే.
రాయ్.. హేల్స్ కూడా..
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ దక్కించుకున్న జేసన్ రాయ్ తో పాటు కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు అలెక్స్ హేల్స్ కూడా పలు కారణాలు చూపి ఐపీఎల్-15 నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో ఎల్ఎస్జీ రూ. 7.5 కోట్లు పెట్టి దక్కించుకున్న వుడ్ కూడా చేరాడు.
ఎందుకు వీడుతున్నారు..?
వ్యక్తిగత సమస్యలతో పాటు కుటుంబంతో గడిపేందుకు ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు జేసన్ రాయ్ చెప్పగా... ఇంగ్లాండ్ లో త్వరలో మొదలయ్యే సమ్మర్ సీజన్ కోసం విశ్రాంతి తీసుకుంటున్నట్టు అలెక్స్ హేల్స్ ప్రకటించాడు. అయితే మిగతా దేశాల లీగ్ లతో పోలిస్తే ఐపీఎల్ కాస్త భిన్నం. ఇప్పుడిక రెండు కొత్త జట్లు కూడా రావడంతో దాని గడువు రెండు నెలలకు పెరిగింది. అంటే ఈ రెండు నెలలు బయో బబుల్ లో గడపాల్సిందే.
దీంతో పాటు ఇటీవలే ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇంగ్లాండ్.. యాషెస్ సిరీస్ లో 4-0తో చిత్తుచిత్తుగా ఓడింది. దీంతో ఇంగ్లాండ్ మాజీలు క్రికెటర్ల మీద దుమ్మెత్తి పోశారు. ఐపీఎల్ ఆడి టెస్టులలో ఆటను మరిచిపోతున్నారని, జాతీయ జట్టు కంటే డబ్బు సంపాదన మీదే ఆటగాళ్లు దృష్టి పెడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కారణంగానే ఇంగ్లాండ్ కు చెందిన పలువురు ఆటగాళ్లు (జో రూట్) వేలానికి పేరు ఇద్దామనుకుని మరీ వెనుకడుగు వేశారు.
ఐపీఎల్ కంటే ఎక్కువ సంపాదన..?
ఐపీఎల్ లో వేలంలో నిలిచి తీరా ఆటకు దూరమవుతున్న ఆటగాళ్లలో పలువురు తాము అనుకున్న ధర రాకపోవడంతో కూడా లీగ్ కు దూరంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఉదాహరణకు జేసన్ రాయ్, అలెక్స్ హేల్స్ లు ఇద్దరూ ఇటీవలే ముగిసిన వేలంలో కనీస ధర (రూ. 1.5 కోట్లు) కు అమ్ముడుపోయారు. కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా రాయ్ కు దక్కేమొత్తం రూ. 9.2 కోట్లు. మ్యాచు ఫీజులు, కౌంటీలు, హండ్రెడ్ లీగ్ కు వచ్చేవి అదనం. లివింగ్ స్టోన్ పరిస్థితి అదే. దీంతో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ లో వచ్చి నెలలకు నెలలు బయో బబుల్ లో గడిపే కంటే అక్కడే కౌంటీలు ఆడి జాతీయ జట్టులో ప్లేస్ పర్మినెంట్ చేసుకుంటే బెటర్ అనే ప్రణాళికల్లో ఉన్నారు.
కాగా.. ఇంగ్లాండ్ ఆటగాళ్ల తీరుపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలా తమకు నచ్చినప్పుడు ఆడి నచ్చకుండే అర్థాంతరంగా వెళ్తున్న ఆటగాళ్లను తీసుకోకపోవడం మంచిదని ఫ్రాంచైజీలను కోరుతున్నారు. ఇదే విషయమై తాజాగా భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ట్వీట్ చేస్తూ.. బయో బబుల్ ను సాకుగా చూపుతూ ఐపీఎల్ ను వీడుతున్న ఇంగ్లీష్ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు తగు చర్యలు తీసుకోవాలని కోరాడు.
2021 లో ఐపీఎల్ ను వీడిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు:
- జానీ బెయిర్ స్టో
-క్రిస్ వోక్స్
-డేవిడ్ మలన్
- లియామ్ లివింగ్ స్టోన్
- మార్క్ వుడ్
2022 సీజన్ లో.. (ఇప్పటివరకు)
- జేసన్ రాయ్
-అలెక్స్ హేల్స్
- మార్క్ వుడ్ (ధృవీకరించాల్సి ఉంది)
ఐపీఎల్ -2022 లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు : లియామ్ లివింగ్ స్టోన్ (పంజాబ్), జోస్ బట్లర్ (రాజస్థాన్), జోఫ్రా ఆర్చర్ (ముంబై), మోయిన్ అలీ (చెన్నై), మార్క్ వుడ్ (లక్నో), బెయిర్ స్టో (పంజాబ్), క్రిస్ జోర్డాన్ (చెన్నై), జేసన్ రాయ్ (గుజరాత్), డేవిడ్ విల్లీ (బెంగళూరు), అలెక్స్ హేల్స్ (కోల్కతా), టైమల్ మిల్స్ (ముంబై), బెన్నీ హోవెల్ (పంజాబ్)
