IND vs PAK: క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా - పాకిస్తాన్. అక్టోబర్ 15న  అహ్మదాబాద్ లోని  ప్రఖ్యాత నరేంద్ర మోడీ స్టేడియం ఈ  సమరానికి వేదిక కానుంది. 

మరో వంద రోజల్లో భారత్‌లో నాలుగేండ్లకోసారి జరుగబోయే అతిపెద్ద క్రికెట్ సంగ్రమం మొదలుకానుంది. అక్టోబర్ 5 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరుగబోయే మ్యాచ్ తో వన్డే వరల్డ్ కప్ మొదలుకానుంది. అయితే ఈ టోర్నీలో క్రికెట్ అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా - పాకిస్తాన్. అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని ప్రఖ్యాత నరేంద్ర మోడీ స్టేడియం ఈ సమరానికి వేదిక కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్ లో హోటల్ రూమ్స్ టారిఫ్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఐసీసీ షెడ్యూల్ రిలీజ్ అయిన మరుక్షణం నుంచే చాలా మంది క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు గాను హోటల్ రూమ్స్ ముందే బుకింగ్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో సాధారణ రోజుల్లో ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో రూ. 6,500 నుంచి రూ. 10 వేల వరకూ ఉండే రూమ్ రెంట్.. ఏకంగా 50 వేలు, రూ. 70 వేలు దాటుతున్నాయట. ఇక సకల వసతులు ఉండే ప్రీమియర్ కేటగిరీ గదుల అద్దెలైతే ఏకంగా రోజుకు లక్ష రూపాయలు దాటే అవకాశం ఉన్నట్టు అహ్మదాబాద్ హోటల్ ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. 

బుకింగ్. కామ్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఐసీసీ షెడ్యూల్ కాకముందు అహ్మదాబాద్ లో ఉన్న ఐటీసీ హోటల్ లో ఒక డీలక్స్ రూమ్ (జులై 2) కు బుక్ చేయగా రూ. 5,699 చూపించింది. కానీ అదే రూమ్ అక్టోబర్ 15న కావాలనుకుంటే మాత్రం ఏకంగా రూ. 71,999గా చూపించడం గమనార్హం. 

అహ్మదాబాద్ లోని మరో ప్రముఖ హోటల్ Renaissance ఫైవ్ స్టార్ హోటల్ లో సాధారణ రోజుల్లో అయితే రూ. 8 వేలు చార్జ్ చేస్తారు. కానీ ఇదే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ రోజు అడ్వాన్స్ బుకింగ్ కోసం చూడగా ఏకంగా రూ. 90,679 గా చూపించింది.

Scroll to load tweet…

పెద్ద హోటల్సే కాదు.. బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ లో కూడా రేట్లు కాక రేపుతున్నాయి. రోజుకు రూ. 3 వేల వరకు ఛార్జ్ చేసే హోటల్స్ లో సుమారు రూ. 30 వేల దాకా పెంచేశాయి. వరల్డ్ కప్.. అదికూడా భారత్ - పాక్ మ్యాచ్ అవడంతో సాధారణంగానే ఈ మ్యాచ్ ను చూసేందుకు వీఐపీలు, ఎన్ఆర్ఐలు చాలా మంది అహ్మదాబాద్ లో వాలిపోతారు. సుమారు వారం రోజుల పాటు అక్కడ పండుగ వాతావారణం ఉంటుంది. దీంతో ఈ క్రేజ్ ను సొమ్ము చేసుకోవడానికి బడా హోటల్స్ రేట్లను ఎకాఎకిన పెంచేశాయి. ఇది ఇలాగే కొనసాగితే అక్టోబర్ 15 నాటికి రేట్లు మరెంత పెరుగతాయోనని సగటు క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.