అప్ఘానిస్థాన్ జట్టును పసికూనగా భావించి లైట్ గా తీసుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెద్ద జట్లను హెచ్చరించారు. ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఆ జట్టు ఎంత ప్రమాదకరమో పాకిస్థాన్ జట్టుతో జరిగిన వార్మప్ మ్యాచ్ తోనే అందరికీ అర్థమయ్యిందన్నాడు. ఇలా తనదైన రోజు ఎంతటి జట్టునయినా మట్టికరిపించగల సత్తా అప్ఘాన్ సొంతమని సచిన్ అభిప్రాయపడ్డారు. 

ఈ ప్రపంచ కప్ లో అప్ఘాన్ ఎన్ని మ్యాచుల్లో గెలుస్తుందో చెప్పలేను కానీ సంచలనాలను సృష్టిస్తుందని మాత్రం చెప్పగలనని సచిన్ అన్నారు. ముఖ్యంగా ఆ జట్టులోని సమిష్టితత్వం ఎంతటి బలమైన జట్టుతో అయినా పోరాడగలిగే ధైర్యాన్ని ఆటగాళ్లకు ఇస్తుందన్నారు. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో అప్ఘాన్ కు తిరుగులేదని... రషీద్ ఖాన్, మజీబ్ ల రూపంలో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు, మహ్మద్ నబీ వంటి ఆల్ రౌండర్ ఆ జట్టు సొంతంమని పేర్కొన్నారు. వీరు రాణిస్తే ఆ జట్టు విజయం సాధించడం, సంచలనాలు నమోదవడం ఖాయమని టెండూల్కర్ వెల్లడించారు.

పాకిస్థాన్ కు వార్మప్ మ్యాచ్ లో షాకిచ్చి అప్ఘాన్ ముందే పెద్ద జట్లకు హెచ్చరికలు పంపింది. దీంతో అన్ని జట్లు ముందుగానే అప్రమత్తమయ్యాయి. ఎలాంటి జట్టుతో తలపడాల్సి వచ్చిన అత్యుత్తమ ఆటగాళ్లతోనే బరిలోకి దిగనున్నాయి. ఒకవేళ వరుస విజయాలతో నాకౌట్ కు చేరుకుంటే తప్ప కెప్టెన్లేవరూ ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. అలా కాదని చిన్న జట్లను అలుసుగా తీసుకుంటే పాకిస్థాన్-అప్ఘాన్ మ్యాచ్ లో మాదిరిగా సంచలనాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.