రంజీ ట్రోఫీ 2022-23: 11 ఓవర్లలో 144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన తమిళనాడు... 7 ఓవర్లలో 108 పరుగులు చేసి హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు... నిర్ణీత సమయం ముగియడంతో డ్రాగా ముగిసిన మ్యాచ్...
టెస్టుల్లో వన్డే స్టైల్ బ్యాటింగ్‌తో ఆడితేనే ఇంగ్లాండ్ స్టైయిల్‌ని ‘బజ్‌బాల్’ అని తెగ మోసేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో టీ20 కాదు, టీ10 బాదుడును తీసుకొచ్చారు తమిళనాడు బ్యాటర్లు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా హైదరాబాద్, తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్‌లో 7 ఓవర్లలో 108 పరుగులు చేసి 15కి పైగా రన్‌రేటుతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు...
ఇంత చేసినా తమిళనాడుకి విజయం దక్కకపోవడం విశేషం. గ్రూప్ బీలో భాగంగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ 135 పరుగులు చేయగా, మికిల్ జైస్వాల్ 137 పరుగులు చేశాడు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు.
తమిళనాడు బౌలర్ సందీప్ వారియర్‌కి ఐదు వికెట్లు దక్కగా లక్ష్మీనారయణ్ విగ్నేష్ 4 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 510 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది తమిళనాడు. సాయి సుదర్శన్ 273 బంతుల్లో 18 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 179 పరుగులు చేయగా నారాయణ్ జగదీశన్ 97 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు.
బాబా అపరాజిత్ 115 పరుగులు చేయగా ఇంద్రజిత్ 48 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ జట్టు 85 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయ్యింది. త్యాగరాజన్ 69 పరుగులు, తన్మయ్ అగర్వాల్ 46 పరుగులు, రోహిత్ రాయుడు 45 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో తమిళనాడు బౌలర్ సాయి కిషోర్‌కి 5 వికెట్లు దక్కాయి.
తమిళనాడు ముందు 144 పరుగుల లక్ష్యం ఉండగా షెడ్యూల్ ప్రకారం 11 ఓవర్లు మాత్రమే మిగిలాయి. 11 ఓవర్లలో 144 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన తమిళనాడుకి ఓపెనర్లు సంచలన ఆరంభం అందించారు. సాయి సుదర్శన్ 20 బంతుల్లో 5 సిక్సర్లతో 42 పరుగులు చేయగా, ఎన్ జగదీశన్ 22 బంతుల్లో 8 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు.
తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోగా 13 సిక్సర్లు వచ్చాయి. అయితే తమిళనాడు బ్యాటర్లు వీరబాదుడు బాదుతుండడంతో హైదరాబాద్ బౌలర్లు ఓవర్లు పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. దీంతో నిర్ణీత సమయంలో 7 ఓవర్లు మాత్రమే వేయగలిగారు. మ్యాచ్ డ్రా అయినట్టు తేల్చారు అంపైర్లు. అయితే హైదరాబాద్‌పై మూడు సెషన్లలో ఆధిపత్యం చూపించిన తమిళనాడుకి 3 పాయింట్లు దక్కగా హైదరాబాద్‌కి ఓ పాయింట్ దక్కింది...
తొలి మ్యాచ్‌లో మణిపూర్‌పై సిక్కిం విజయం సాధించగా అరుణ్‌చల్ ప్రదేశ్‌ని ఇన్నింగ్స్ తేడాతో ఓడించింది బీహార్. ఇషాన్ కిషన్ సెంచరీ చేసినా జార్ఖండ్‌ని కాపాడలేకపోయాడు. జార్ఖండ్‌పై కేరళ విజయం అందుకోగా, విదర్భ చేతిలో చిత్తుగా ఓడింది రైల్వేస్ జట్టు...
హర్యానాపై హిమాచల్‌ప్రదేశ్ ఇన్నింగ్స్ తేడాతో గెలవగా జమ్మూ కశ్మీర్‌ని చిత్తుగా ఓడింది మధ్యప్రదేశ్. మిజోరాంతో జరిగిన మ్యాచ్‌లో మేఘాలయ 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకోగా పుద్దుచ్చేరిపై ఛత్తీస్‌ఘండ్, నాగాలాండ్‌పై ఉత్తరాఖండ్‌తో భారీ తేడాతో గెలిచాయి. ఆంధ్రాపై ముంబై 9 వికెట్ల తేడాతో, ఉత్తర ప్రదేశ్‌పై బెంగాల్ 6 వికెట్ల తేడాతో విజయాలను అందుకున్నాయి. ఢిల్లీని మహారాష్ట్ర 9 వికెట్ల తేడాతో ఓడించగా మిగిలిన మ్యాచులన్నీ డ్రాలుగా ముగిశాయి..
