ఆక్లాండ్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఎంతగానో మిస్సవుతున్నామని భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అన్నాడు. చాహల్ టీవీతో బీసీసీఐ నిర్వహించే కార్యక్రమంలో ఆయన ఆ విధంగా అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత చాహాల్ తన జట్టు సభ్యులను ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. 

న్యూజిలాండ్ రెండో టీ20 ముగిసిన తర్వాత టీమిండియా సభ్యులు ఆక్లాండ్ నుంచి హామిల్టన్ కు ప్రయాణిస్తున్న బస్సులో చాహల్ తన చాహల్ టీవీ నిర్వహించాడు. ఇందులో బుమ్రా, కుల్దీప్ యాదవ్, కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీ, రిషబ్ పంత్ సరదాగా మాట్లాడుకున్నారు. 

చివరగా బస్సు ఆఖరు సీటు వద్దకు వెళ్లి... ఖాళీ సీటు పక్కన మరో సీటులో కూర్చున్నాడు.  "చాహల్ టీవీకి రాని ఓ వ్యక్తి ఉన్నాడు. ఆయన రావాలనుకున్నాడు. రావడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడు. నో భయ్యా ఇది సరైన సమయం కాదని చెప్పా" అని నవ్వుతూ అతను అన్నాడు.

అలా అన్న తర్వాత చాహల్ కాస్తా ఉద్వేగానికి గురయ్యాడు. అది మహీ సీటు అని వెల్లడించాడు. అది మహీ కోసమే రిజర్వ్ చేసి ఉందని అన్నాడు. ఇంకా... "ఇది లెజెంజ్ ధోనీ సీటు. అది అతడికి మాత్రమే ప్రత్యేకంగా సొంతం. అందుకే అతడి స్థానంలో ఎవరూ కూర్చోవడం లేదు. మహీ భాయ్ ని ఎంతో మిస్సవుతున్నాం" అని చాహల్ వ్యాఖ్యానించాడు.

ప్రపంచ కప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. దాంతో ఎంఎస్ ధోనీ తిరిగి జట్టులోకి రావడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇటీవల బిసీసీఐ ధోనీకి వార్షిక కాంట్రాక్టు ఇవ్వకపోవడంతో ఆ సందేహాలకు మరింతగా బలం చేకూరింది.