బెంగళూరు: ఆస్ట్రేలియాపై జరిగిన మూడో వన్డేలో తాము విజయానికి అనుసరించిన వ్యూహంపై టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశామని, 290 పరుగుల లోపే ఆస్ట్రేలియాను కట్టడి చేయాలనే తమ ప్రణాళిక సక్సెస్ అయిందని ఆయన అన్నాడు. 

ఇది చాలా కీలకమైన మ్యాచ్ అని, సిరీస్ ను డిసైడ్ చేసే మ్యాచ్ అని, అందువల్ల రాహుల్ తో కలిసి మంచి ఇన్నింగ్సు నిర్మించడానికి ప్రయత్నించానని రోహిత్ శర్మ అన్నాడు. రాహుల్ ఔటైన తర్వాత తామిద్దరం భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాలని తాను, విరాట్ కోహ్లీ అనుకున్నామని చెప్పాడు.

Also Read: 9 వేల పరుగుల మైలు రాయి దాటిన రోహిత్ శర్మ

ఆ సమయంలో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడానికి కోహ్లీకి మించిన మంచి బ్యాట్స్ మన్ ఎవరూ ఉండరని ఆయన అన్నాడు. అందువల్ల బాధ్యతాయుతంగా ఆడామని ఆయన చెప్పారు. ఒకరం డిఫెన్స్ చేస్తే మరొకరం అఫెన్స్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 

తానే తన సహజమైన శైలిలో ఆడుతానని కోహ్లీకి చెప్పానని, రిస్క్ చేస్తానని కూడా చెప్పానని, ఆసీస్ టాప్ 3 బౌలర్ల నుంచి తమకు తీవ్ర ప్రతిఘటన ఎదురైందని, అయినా అధిగమించామని ఆయన చెప్పాడు. దాంతోనే వందకు పైగా పరుగుల భాగస్యామ్యాన్ని నెలకొల్పామని చెప్పాడు. ఈ మ్యాచులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Also Read: బెంగళూరు వన్డే: ఏకపక్షం.. ఆసీస్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం, సిరీస్ కైవసం

మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించి భారత్ సిరీస్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని ఇండియా 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 128 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 119 పరుగులు చేశాడు.