Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ నిర్ణయం ప్రమాదకరం: అమెరికా లోటును తీర్చటం కష్టమే...

డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేయడం ప్రమాదకరం అని బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కో ఫౌండర్ మిలిందా గేట్స్ అభిప్రాయ పడ్డారు. తాజాగా మరో 150 మిలియన్ల డాలర్ల విరాళాన్ని డబ్ల్యూహెచ్ఓకు అందజేస్తున్నట్లు ప్రకటించారు.
 

Gates Foundation adds $150M to fight coronavirus, calling for 'unprecedented' international cooperation
Author
Hyderabad, First Published Apr 17, 2020, 10:45 AM IST

వాషింగ్టన్‌: ప్రపంచ మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కృషి చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు బిల్‌గేట్స్‌ సతీమణి, గేట్స్‌ ఫౌండేషన్‌ కో ఫౌండర్ మిలిందా గేట్స్‌ మరోసారి భారీ విరాళం ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో... అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహాయాన్ని ఉపసంహరించుకోవటం అవివేకమే కాకుండా ప్రమాదకరమని మిలిందా పేర్కొన్నారు.

తాజాగా తమ ‘బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌’ తరపున డబ్ల్యూహెచ్‌వోకు మరో 150 మిలియన్‌ డాలర్ల విరాళాన్ని ఆమె ప్రకటించారు. ఈ నిధితో కరోనా బాధితులకు చికిత్స, వ్యాక్సిన్ల తయారీ, నివారణ వంటి చర్యలను వేగవంతం చేయాలని అభిలషించారు. 

కొవిడ్‌-19ను నిలువరించటంలో విఫలమైందని ఆరోపిస్తూ డబ్ల్యూహెచ్ఓకు అమెరికా నిధులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా, అమెరికా తరువాత, డబ్ల్యూహెచ్ఓకు గేట్స్‌ ఫౌండేషన్‌ అతి పెద్ద దాత కావటం గమనార్హం. కరోనాపై పోరాటంలో భాగంగా శాస్త్రీయ, ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రారంభించేందుకు గేట్స్‌ ఫౌండేషన్‌ తొలుత 100 మిలియన్‌ డాలర్ల విరాళంగా అందించింది. 

తాజా విరాళంతో బిల్ గేట్స్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన విరాళం మొత్తం 250 మిలియన్‌ డాలర్లను చేరుకుంది. ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొవిడ్‌-19 మహమ్మారిని సరైన విధంగా ఎదుర్కోవటానికి డబ్ల్యూహెచ్ఓ తగినదని ఆమె కితాబిచ్చారు. నేటి సంకట స్థితిలో ప్రపంచమంతా ఏకమై చేతులు కలపాలని పిలుపునిచ్చారు. అయితే అమెరికా మొండిచేయి చూపటం వల్ల ఏర్పడిన లోటును ఇతరులు తీర్చటం కష్టమేనని కూడా మిలిందా గేట్స్‌ అభిప్రాయపడ్డారు. 

also read ఉద్యోగులకు వడ్డీ లేని రుణాలను ప్రకటించిన విజిల్‌ డ్రైవ్ సంస్థ...

ఇదిలా ఉంటే డబ్ల్యూహెచ్‌వోకు ఎలా వస్తాయ్‌? ఏయే దేశాల భాగస్వామ్యం ఎంత? అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం.. ట్రంప్‌ చెప్పినట్లు డబ్ల్యూహెచ్‌వోకు పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చేది అమెరికా. ఈ సంస్థకు సమకూరే నిధుల్లో అమెరికా వాటా 14.67 శాతం. ఆ స్థాయిలో బిల్‌గేట్స్‌కు చెందిన బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ 9.76 శాతం నిధులు అందిస్తోంది. 

జెనీవా కేంద్రంగా పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేసే ‘గవి’ అలయన్స్‌ 8.39 శాతం నిధులు అందిస్తోంది. ఈ సంస్థకు బిల్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తుండడం గమనార్హం. ఆ తర్వాత యూకే (7.79 శాతం), జర్మనీ (5.68 శాతం) పెద్ద మొత్తంలో నిధులు అందిస్తున్నాయి. 

ఐరాస కో-ఆర్డినేషన్ ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ (5 శాతం), ప్రపంచ బ్యాంకు (3.42 శాతం) రోటరీ ఇంటర్నేషనల్‌ (3.3 శాతం), యూరోపియన్‌ కమిషన్‌ (3.3 శాతం), జపాన్‌ (2.7 శాతం) చొప్పున డబ్ల్యూహెచ్‌వోకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుస్తుండడం గమనార్హం. 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినట్లు డబ్ల్యూహెచ్‌వోకు చైనా సాయం నామమాత్రమే. మొత్తం నిధుల్లో ఆ దేశం కేవలం 0.21 శాతం మాత్రమే ఇస్తోంది. అదే సమయంలో భారత్‌ 0.48 శాతం, పాకిస్థాన్‌ 0.36 శాతం చొప్పున నిధులు ఇస్తుండడం గమనార్హం. ఫ్రాన్స్‌ 0.5 శాతం నిధులు అందిస్తోంది. 

డబ్ల్యూహెచ్‌వోకు స్వచ్ఛందంగా వచ్చే నిధులే అధికం. మొత్తం నిధుల్లో 80 శాతం ఈ విధంగా వచ్చేవే. డబ్ల్యూహెచ్‌వోలో సభ్య దేశాలైన 194, ఎన్జీవోలు ఈ నిధులను అందిస్తున్నాయి. అయితే, ఇవి రెండు రకాలుగా ఉంటాయి. సంస్థ తన అవసరాలు, ప్రాధాన్య అంశాలకు ఖర్చు చేయడానికి వినియోగించే నిధులను కోర్‌ వాలంటరీ కంట్రిబ్యూషన్‌ అంటారు.

ప్రత్యేకించి ఒకదానిపై మాత్రమే ఖర్చు చేయడానికి వీలుండే నిధులను స్పెసిఫైడ్‌ వాలంటరీ కంట్రిబ్యూషన్‌గా పేర్కొంటారు. డబ్ల్యూహెచ్‌వోలో సభ్యత్వానికి గానూ చెల్లించే ఫీజును అసెస్డ్‌ కంట్రిబ్యూషన్‌ అంటారు. ఈ మొత్తం 17 శాతంగా ఉంటుంది. 

ఒక్కోదేశానికి ఒక్కోలా ఉంటుంది. ఒక్క అమెరికానే దాదాపు 15 శాతం నిధులు సమకూరుస్తుండడం గమనార్హం. ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల కట్టడికి కోసం ఏర్పాటు చేసిన పాండమిక్‌ ఇన్‌ఫ్లూయెంజా ప్రిపేర్డ్‌నెస్‌ కింద మరో 3 శాతం వరకు నిధులు డబ్ల్యూహెచ్‌వోకు అందుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios