coronavirus : ఫిబ్రవరి 1-15 తేదీల మధ్య థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ - ఐఐటీ మద్రాస్ విశ్లేషణ
కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి 1-15 మధ్య పీక్ స్టేజ్ కు వెళ్లే అవకాశం ఉందని ఐఐటీ మద్రాస్ అంచనా వేసింది. ఈ మేరకు ఓ విశ్లేషణ విడుదల చేసింది.
కరోనా (corona) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు వేవ్‌లు (waves) దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి వెళ్లాయి. కరోనా రెండు వేవ్‌ల దేశం ఆర్థికంగా దెబ్బతింది. ఎంతో మంది ప్రజలు నిరుద్యోగులయ్యారు. మరెంతో మంది తమ ఆత్మీయులను కోల్పొయారు. మొదటి లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది కాలినడక తమ ఇళ్లకు చేరుకున్నారు. గతేడాది మళ్లీ రెండో వేవ్ వచ్చింది. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతోందనుకుంటున్న సమయంలో మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
దాదాపు అన్ని రాష్ట్రాల్లోను దసరా కంటే ముందు స్కూళ్లు, (schools), కాలేజీలు (colleges) ఓపెన్ చేశారు. రెండేళ్లుగా ప్రత్యక్ష తరగతులకు (direct clasess) దూరమైన విద్యార్థులు ఇప్పుడిప్పుడే సరిగ్గా పాఠాలు వింటున్నారు. చదువుగాడిలో పడుతోన్న సమయంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాల్లో 1-9వ తరగతి పిల్లలకు సెలవులు ప్రకటించారు. మరి కొద్ది రోజుల్లో వాటిని తెరుస్తామని చెప్పారు. పది, ఆ పైన తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. 15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భావించింది. ఈ నెల 3వ తేదీ నుంచి టీకాలు ఇవ్వడం ప్రారంభించింది. ఇలా చేయడం వల్ల పిల్లలకు కరోనా సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అందుకే పెద్ద తరగతుల వారికి సెలవులు ఇవ్వలేదు.
దేశ వ్యాప్తంగా గత వారం కిందట రోజుకు 10 వేల కంటే తక్కువగా కరోనా కేసులు నమోదయ్యేవి. రెండు రోజుల క్రితం నుంచి ఈ కేసులు ఏకంగా లక్ష దాటుతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. దీనిని బట్టి చూస్తే దేశంలో ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ విషయాన్ని పలు రాష్ట్రాలు కూడా వెళ్లడించాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ పది రోజుల కిందటే మాట్లాడారు. బీహార్‌లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని తెలిపారు. ఇంతలా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ ఓ విశ్లేషణ విడుదల చేసింది. ఈ విశ్లేషణ ప్రకారం భారతదేశంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు వెళ్తుందని అంచనా వేసింది. తరువాత తగ్గిపోతుందని తెలిపింది.
24 గంటల్లో 1.4 లక్షల కొత్త కేసులు..
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏడు నెలలు తరువాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అలాగే గత 24 గంటల్లో కరోనాతో పోరాడతూ 285 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో ఇప్పటి వరకు కరోనాతో ప్రాణాలు కోల్పొయిన వారి సంఖ్య 4,83,178 కి చేరింది. మొత్తం కరోనా బారినపడ్డవారి సంఖ్య 3,53,68,372కు చేరింది. 24 గంటల్లో కరోనా నుంచి 40,895 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 4,72,169 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అధికంగా కోవిడ్ -19 (covid-19)కేసులు ఉన్నాయి.