corona virus : ముంబాయిలో కేసులు నియంత్రణలో ఉన్నాయి- హైకోర్టుకు తెలిపిన బీఎంసీ

ముంబాయిలో కరోనా కేసులు నియంత్రణలో ఉన్నాయని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన  అవసరం లేదని బృహ‌ణ్ ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తెలిపింది. ఈ మేరకు హైకోర్టుకు బుధవారం నివేదిక సమర్పించింది. 

corona virus: Cases under control in Mumbai - BMC tells High Court

మహారాష్ట్రలోని ముంబాయి (mumbai) లో, దాని పరిసర ప్రాంతాల్లో కోవిడ్ - 19 (covid -19)  కేసులు నియంత్రణలో ఉన్నాయ‌ని బృహ‌ణ్ ముంబాయి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (BMC)  హైకోర్టుకు తెలిపింది. పౌరులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. కరోనా థర్డ్ వేవ్ స్థిరంగా తగ్గుతోందని సీనియర్ న్యాయవాది అనిల్ సఖ్రే  చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన ధర్మాసనానికి తెలియజేశారు.

గడిచిన 24 గంటల్లో ముంబైలో 6,032 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 12 మరణాలు సంభవించాయి. అలాగే కోవిడ్ -19 నుంచి 18,241 మంది కోలుకున్నారు. ముంబైలో టెస్ట్ పాజిటివిటీ రేటు గతంలో 12.89 శాతం ఉండగా.. ఇప్పుడ‌ది 10 శాతానికి పడిపోయింది. ముంబైలో ప్ర‌స్తుతం 31,856 కోవిడ్-19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కోవిడ్ -19 కేసులు విష‌యంలో మంత్రి గైక్వాడ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. వారం రోజుల త‌రువాత కోవిడ్ -19 కేసుల‌ను స‌మీక్షించి..  స్కూళ్లు తెర‌వాల‌నే ప్ర‌తిపాద‌న‌ను సీఎం ఉద్ద‌వ్ ఠాక్రెకు పంపించామ‌ని అన్నారు. ప్రీ ప్రైమ‌రీ స్కూళ్ల‌ను తెర‌వాల‌ని ప్ర‌తిపాదించామ‌ని అన్నారు. 

దేశంలోకి క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్ర‌వేశించ‌డంతో మ‌హారాష్ట్రలో  కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. దీంతో రాష్ట్రంలోని  పాఠశాలలను ఫిబ్రవరి 15 వరకు మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల మొద‌టి నుంచి ఈ ఉత్త‌ర్వులు అమ‌ల్లోకి వ‌చ్చాయి. అయితే ఇప్పుడు కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో పాఠ‌శాల‌ను తెర‌వాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం ఉంది. మ‌హారాష్ట్రలో కొత్త కోవిడ్ -19 కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోంద‌ని, ప‌రిస్థితి అదుపులోనే ఉంద‌ని మ‌హారాష్ట్ర మంత్రి రాజేష్ తోపే తెలిపారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న COVID-19 థ‌ర్డ్ వేవ్ లో ముంబైలో కేసులు స్థిరంగా ఉన్నాయ‌ని, ఇదే స‌మ‌యంలో బెంగళూరు, పూణే వంటి ఇతర నగరాల్లో కేసులు పెరుగుతున్నాయ‌ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం వెల్లడించింది. ఇదిలా ఉండ‌గా ఈ వారం హర్యానా, గుజరాత్, మహారాష్ట్రలలో కోవిడ్ -19 థ‌ర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరుకుంటుందని  IIT కాన్పూర్ ప్రొఫెసర్ ఒక‌రు తెలిపారు. ఇప్ప‌టికే ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో ఓమిక్రాన్ వేరియంట్ పీక్ స్టేజ్ కు చేరుకుంద‌ని ఆయ‌న చెప్పారు. 

గ‌డిచిన 24 గంటల్లో దేశంలో 3,13,603 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. గ‌త వారంతో పోలిస్తే బుధ‌వారం కేసులు 27% పెరిగాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.8 కోట్ల‌కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18.9 లక్షల మార్కును దాటింది. ఇందులో మహారాష్ట్రలో 43,697 క‌రోనా కేసులు నమోదయ్యాయి. క‌ర్నాట‌క‌లో 40,499, కేరళలో  34,199 కేసులు వెగులుచూశాయి. ఇక్క‌డ 475 మ‌ర‌ణాలు సైతం న‌మోద‌య్యాయి. గత వారంలో నమోదైన సగటు స్థాయిల కంటే ఇది చాలా ఎక్కువ. దీంతో కోవిడ్‌-19 మొత్తం మరణాల సంఖ్య 4,87,505కి చేరుకుంది. కొత్త మ‌ర‌ణాల్లో కేరళలో అధికంగా 134 మంది చ‌నిపోయారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (49), పశ్చిమ బెంగాల్ (38)లు ఉన్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios