ఈ-కామర్స్ సంస్థలకు గుడ్ న్యూస్...20 నుంచి ఆన్ లైన్ ఆర్డర్లకు గ్రీన్ సిగ్నల్

ఎట్టకేలకు ఈ-కామర్స్ సంస్థలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 20 నుంచి నిత్యావసేతర వస్తువుల ఆర్డర్లను ఈ-కామర్స్ సంస్థలు స్వీకరించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. తదనుగుణంగా ఫ్లిప్ కార్ట్ ఆర్డర్లను ఆహ్వానించింది. అమెజాన్ మాత్రం కేంద్రం నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తోంది. 

Amazon And Flipkart may resume full operations after April 20

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ నుంచి ఎట్టకేలకు కేంద్రం కొన్ని సడలింపులిచ్చింది. అందులో ఈ–కామర్స్‌ విక్రయాలకు అనుమతించింది. 

దీంతో ఏప్రిల్‌ 20 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్‌ వంటి ఈ – కామర్స్‌ పోర్టల్స్‌లో మళ్లీ మొబైల్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఉత్పత్తులు వినియోగ దారులకు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు.

మే 3 దాకా పొడిగించిన లాక్‌డౌన్‌ మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు ఈ మేరకు వివరణ ఇచ్చారు. టీవీలు, మొబైల్‌ ఫోన్లు కూడా ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

వాణిజ్య, ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఈ–కామర్స్‌ కంపెనీల డెలివరీ వ్యాన్లు.. రోడ్ల మీదికి రావాలంటే స్థానిక అధికారుల నుంచి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు.

also read కరోనా వైరస్ పేషెంట్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్...

మార్చి 25వ తేదీన తొలిసారిగా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఈ–కామర్స్‌ సంస్థలు కేవలం ఔషధాలు, ఆహారపదార్థాల వంటి నిత్యావసరాలే విక్రయానికి అనుమతినిచ్చారు. సరుకు రవాణా, డెలివరీ మొదలైన సర్వీసుల ద్వారా చాలా మంది ఉపాధి పొందుతుండటంతో వారి ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బుధవారం ప్రకటించిన మార్గదర్శకాలపై నెలకొన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసింది.

‘సేవా రంగంలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పాత్ర కీలకం. దేశాభివ్రుద్ధికి డిజిటల్ సేవలు చాలా అవసరం. అందువల్లే ఈ-కామర్స్ సంస్థలతోపాటు ఐటీ, ఐటీ అనుబంధ సేవలు, ఆన్ లైన్ బోధన, దూర విద్య తరగతుల నిర్వహణకు అనుమతినిస్తున్నాం’ అని కేంద్ర హోంశాఖ తన మార్గదర్శకాల్లో తెలిపింది.

ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, టీవీ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి వీలు లేదు. కానీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో ఈ-కామర్స్ లావాదేవీలకు ద్వారాలు తెరుచుకున్నట్లేనని భావిస్తున్నారు. 

ప్రభుత్వ మార్గదర్శకాలు వెలువడిన వెంటనే నిత్యావసరేతర వస్తువులకు కూడా ఏప్రిల్ 20 నుంచి ఆర్డర్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్ మాత్రం కేంద్రం నుంచి మరింత స్పష్టత కోసం ఎదురు చూస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios