Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ మాటల తర్వాత పోలీసులు అతి చేస్తున్నారు: కె. సజయ

అవసరమైతే ఆర్మీని దించుతామని, 24 గంటల కర్ఫ్యూ విధిస్తామని, కనిపిస్తే కాల్చేస్తామనే ఆర్డర్స్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత పోలీసులు అతి చేస్తున్నారని, సజయ అన్నారు. ప్రజాప్రతినిధులు కూడా లాఠీలు పడుతున్నారని ఆమె అన్నారు.

Lock down: Social activist K Sajaya opposes police excess
Author
Hyderabad, First Published Mar 28, 2020, 6:20 PM IST

కరోనా కట్టడి నేపథ్యంలో వలస కార్మికుల పరిస్థితి ఏమిటి? రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యజనం భయాందోళనలు ఏమిటి? అంత రిస్క్ తీసుకుని వారెందుకు కాలి నడకన స్వస్థలాలకు వెలుతున్నారు. లక్షలాది మంది ఇప్పటికే అలా వెళ్ళడానికి కారణం ఏమిటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతెన్నులు, ఇతర విషయాలపైనే కాదు, ఈ విపత్కర పరిస్థితుల్లో మన బాధ్యత గురించి ఎన్నో అంశాలను సామాజిక కార్యకర్త సజయ పంచుకున్నారు.

సజయ పాత్రికేయురాలు, యాక్టివిస్టు. పిల్లలు, రైతులు, మహిళల అంశాల్లోనే కాదు, యురేనియం ప్రాజెక్టు వంటి భారీ అభివృద్ధి ప్రాజెక్టుల వెనకాల కానరాని విధ్వంసం గురించి ఎప్పటికప్పుడు చైతన్యం చేసే పాత్రికేయురాలు. లిఖిత ప్రచురణా సంస్థ బాధ్యులు. హైదరాబాద్ లో నివసిస్తారు. వారితో చేసిన ముఖాముఖిలోని ముఖ్యాంశాలు....

*లాక్ డౌన్ వల్ల రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది?

 ముఖ్యంగా మార్చి 31 వరకే ఉన్న లాక్ డౌన్ ను ఏప్రిల్ రెండో వారంతం వరకూ పొడగించడంతో ఒక రకంగా కరోనా వైరస్ నుంచి మనం రక్షణలో ఉన్నప్పటికీ మరో వైపు కొన్ని అంశాల్లో పరిస్థితి అదుపులో లేకుండా పోయిందనే చెప్పాలి.

ప్రభుత్వం తక్షణం స్పందించి చేప్పట్టిన మంచి పనులు చాలా ఉన్నా, ఆందోళనకరమైనవి మాట్లాడుకోవాల్సిందే.

*సామాన్య పౌరులు, ముఖ్యంగా వలస కూలీల పరిస్థితి ఏమిటి?

ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలు వేలు కూడా కాదు, లక్షలాది జనం హైదరాబాద్ పట్టణం నుంచి తమ స్వస్థలాలకు నడచిపోతున్న విషయం మనం గ్రహించాలి.

వీళ్ళంతా ప్రధానంగా వలస కార్మికులు. భవన నిర్మాణ కూలీలు. ఆ రోజుకే కాదు, మున్ముందు కూడా పని లేకపోవడం ఒకటైతే, తినడానికి తిండి లేకపోవడం, ఒకరితో ఒకరు సన్నిహితంగా ముచ్చట పెట్టుకోలేని పరిస్థితి, సోషల్ డిస్టెన్స్ అనివార్యంగా పాటించాల్సి రావడం, అద్దె ఇండ్లలో ఉండటం, దానికి తోడు రేషన్  కార్డులపై ఇచ్చే నిత్యావసర సరకుల కోసం ఇంటికి పోవాల్సి రావడం, ఇండ్ల నుంచి రా రమ్మని ఫోన్లు అధికం కావడం- వీటన్నిటితో వీరంతా తీవ్ర ఒత్తిడికి లోనవడం, అనివార్యంగా పిల్లాపాపలతో నడుచుకుంటూ వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామాలకు వెళ్లి పోవడం ఎంతో బాధాకరం.

వారిలో కొందరితో మేం టెలిపోన్ లో కాంటాక్ట్ లో ఉంటూ అక్కడక్కడా తెలిసిన వారికి సమాచారం ఇస్తూ ఫాలో అప్ చేస్తున్నాం. పోలీసులతో మాట్లాడుతూ సర్ది చెబుతున్నాం. ఇదే మూడు నాలుగు రోజులుగా మాకు ప్రధాన పని అయింది.

సాధారణంగా అందరూ అనుకుంటున్నది, ఒక్క మహాబూబ్ నగర్ కు మాత్రమే తిరుగు వలస జరుగుతోంది అని. కానీ, తెలంగాణ అన్ని జిల్లాలకు జరుగుతోంది. భయటి రాష్ట్రాలకు కూడా. వీరంతా నాలుగైదు రాష్ట్రాలకు చెందిన సామాన్య ప్రజానీకం. మన రాష్ట్రానికి వస్తే అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన వలస కూలీలు కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో బీహార్, మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సాకు చెందిన వారున్నారు. ఒక్క ఆరంగర్ ప్రాంతం ముంచే యాభై వేల మంది ఇలా కాలినడకన స్వగ్రామాలకు నడిచి వెళ్ళారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు.

*ఇలా వెళ్ళడం మంచిది కాదు కదా!

నిజమే. ఇలా వెళ్ళడం మంచిది కాదు. కానీ,  వారంతా ఇక్కడే ఉండలేని పరిస్థితి కూడా ఒక వాస్తవికత. ఈ విపత్కర సమయంలో ఎన్ని లక్షల మంది ఎన్నెన్ని రకాల పనుల్లో హైదరాబాద్ పట్టణంలో జీవిక పొందుతున్నారో మా దృష్టికి వచ్చింది. అదే సమయంలో ఆ పనులేవీ లేకపోవడంతో కేవలం ప్రబుత్వ సహాయం కోసం ఎదిరిచూడటం అన్నది ఎంత అభద్రతకు గురిచేస్తుందో వారి కోణంలో ఆలోచిస్తేగానీ బోధపడదు. అందుకే వారు ఎవరి మాటా వినకుండా వెళుతున్నారు. వెళ్ళాక, పోలీసుల అడ్డుకుంటున్నప్పుడు గానీ ఆ సంగతి మన దాకా రావడం లేదు.

ఉదయాన్నే ఇంత వండుకుని, టిఫిన్ కట్టుకుని అడ్డామీదకు వెళ్ళే లేబర్ సడెన్ గా పనిపాటా బంద్ కావడంతో స్వగ్రామాలకు వెళ్ళడమే వారికి చేతనైన పరిష్కారంగా తోస్తోంది. 

నిజానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అనంతరం తలెత్తే పరిస్థితులను వివిధ రాష్ట్రాలతో చర్చించి తగిన వ్యూహం అమలు చేయకుండానే ఎమర్జెన్సీలోకి దిగడం ఈ మొత్తం సమస్యకు ఒక ముఖ్య కారణం.

ఊహన్ నగరంలో లాక్ డౌన్ సమయానికే ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. టోటల్ లాక్ డౌన్ పెట్టెటప్పటికి ఇంటి ముందుకు నిత్యావసర వస్తువులు దిగాయి. అలాగే అమెరికాలో కూడా ప్రజలు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుందనగానే ఒక్కో చోట కనీసం రెండు మూడు రోజుల ముందైనా సమాచారం ఇచ్చారు. కానీ, ఇంత పెద్ద దేశమైన భారతంలో సామాన్య ప్రజల అవస్థలను పరిగణలోకి తీసుకోకుండా విధించిన ఎమర్జెన్సీ ఆచరణలో సామాన్యులను బెంబేలెత్తించింది. వారి అవస్థలను పెంచింది. ఇబ్బందులు పడుతూ నడిచి వెళ్ళడం అందులో భాగమే.

*ముందు చూపు లేని ఎమర్జెన్సీ అంటారా?

అవుననే చెప్పాలి. నిజానికి ప్రభుత్వం తొలుత విమానయాణాన్ని నియత్రించడంలో ఆలస్యం చేసింది. తర్వత రైలు సౌకర్యం విషయంలో నిదానంగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత టక్కున మొత్తం ప్రయాణ సౌకర్యాలను నిలిపివేసి, లాక్ డౌన్ ప్రకటించింది. దాంతో ఎక్కడికక్కడ ప్రజలు నిలిచిపోయారు. రోజు వారీ జీవితమే దినదిన గండగా గడిపే వలస కూలీలు అనివార్యంగా కాలినడకన ఎన్నో అవస్థలు పడుతూ ఇండ్లకు చేరడానికి కారణమైంది. తెలంగాణ, ఆంధ్రా రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దీనివల్ల కరోనా విస్తరించదా అంటే విస్తరించవచ్చు కూడా. కానీ, ఇలాంటి పరిస్థితి రాకుండా నివారించాలన్న దృష్టి ప్రభుత్వానికి లేకపోవడం విచారకరం. 

హాస్టల్స్ విషయంలో కూడా ఇరు ప్రభుత్వాల సమన్వయం లోపంతో విద్యార్థుల పడ్డ ఇబ్బందులు మనం చూస్తూనే ఉన్నాం.

*ప్రభుత్వం ఎలా వ్యవహరించి ఉండాల్సింది?

-నిజానికి ఇంత పెద్ద విపత్తు నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కటిగా ఏమీ చేయలేదన్న  వాస్తవాన్ని గ్రహించవలసి ఉండింది. ఎంతో ముందు చూపుతో ప్రబుత్వం సివిల్ సొసైటీని భాగాస్వామ్యం చేయవలసి ఉండింది. ముఖ్యంగా విపత్తుల నివారణలో ఎంతో అనుభవం గడించిన యాక్షన్ ఎయిడ్, ఆక్స్ ఫాం వంటి స్వచ్ఛంద సంస్థలు మనకున్నాయి. వివిధ రంగాల్లో సుదీర్ఘకాలం పనిచేసిన సామాజిక కార్యకర్తలూ మన దగ్గర ఎంతో మంది ఉన్నారు. వారంతా మొదటి రోజు నుంచే ప్ర్రభుత్వానికి చెబుతూనే ఉన్నారు. కానీ, ప్రభుత్వం వారితో ఎటువంటి సంబాషణ చేయలేదు. ఎవరినీ విశ్వాసంలోకి తీసుకోలేదు. ఒక వేల సమిష్టిగా ముందుకు పోయే పరిస్థితే ఉంటే, ముఖ్యంగా వలస కూలీల విషయంలో ఇలాంటి గంధర గోళం నెలకొనేది కాదు. కాలి నడకన ఎంతమంది ఎక్కడెక్కడికి వెళ్ళారో కూడా మేం సమాచారం ఇస్తామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినలేదు. కానీ, ఆలస్యంగా ప్రభుత్వం ఇప్పుడు స్పందిస్తోంది. “మాకు వాలంటీర్లు కావాలి, మాతో  కలిసి రండి అంటోంది”.

మేం మొదటి రోజు నుంచే ప్రభుత్వంతో సంప్రదిస్తూనే ఉన్నాం. చీఫ్ సెక్రటరీ స్థాయిలో టచ్ లోనే ఉన్నాం. మొదట్లో ‘అపాయింట్ మెంట్ ఇవ్వం’ అన్నారు. ‘సరే’ అని మెయిల్స్, వాట్స్ అప్, ట్వీట్స్ ద్వారా మేం చెప్పవలసింది చెబుతూనే ఉన్నాం. మా విజ్ఞప్తి, డిమాండ్లు వారికి చేరుతున్నట్టు సమాధానమైతే ఇస్తున్నారు. కానీ చేయవలిసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.

మధ్యతరగతి కూడా ముందు మే చేస్తున్న పనుల గురించి నెగటివ్ గా ఆలోచించింది. ట్రోల్ చేసే దాకా వెళ్ళింది. ఇప్పుడు వారు కూడా సమస్య లోతును అర్థం చేసుకోవడం అభినందనీయం. సామాన్య ప్రజలకు ఆహారం అందించడానికి ఎక్కడిక్కక్కడ ముందుకు వస్తున్నారు.

మేం ప్రభుత్వానికి నివేదిస్తూనే ఉన్నాం. వలస కూలీల సమస్య ఇంకా ఉంది. భవన నిర్మాణ కూలీల సమస్యా ఉన్నది. డొమెస్టిక్ వర్కర్ల సమస్య ఉంది. ట్రాన్స్ జెండర్ల్ సమస్య ఉంది. మునిసిపల్ వర్కర్ల చేతులకు గ్లోవ్స్ లేవు. అవి సేకరించాం. వాటిని అవసరమైన వారికి అందజేయాల్సి ఉంది. అలాగే, తక్షణం అన్నపూర్ణ సెంటర్ల ఏర్పాటు, పెంపు గురించి ఆలోచించవలసి ఉంది. రేషన్ ఇవ్వడం ఇంకా మొదలు కాలేదు. ఆ సమస్యా ఉన్నది. ఇవన్నిటితో పాటు, గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉన్నట్టు, గవర్నమెంట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పని చేసే పరిస్థితి ఇంకా లేదు. ఇలాంటి చర్యల గురించి ఆలోచించాలి.

*స్ఫూర్తి వంతమైన విషయాలు చెబుతారా?

ప్రపంచ మంతా ప్రభలిన వైరస్ నేపథ్యంలో ‘కరోనాపై యుద్ధం’ ఏ ఒక్కరి బాధ్యతో కాదు. అందరం కలిసి కట్టుగా అండగా నిలబడవలసిన సందర్భం ఇది. ఆ రాష్ట్రం ఏదైనా మెరుగైన ఫలితాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్ఫూర్తి పొంది దేశాన్ని రక్షించుకోవాల్సిన తరుణం ఇది. ఆ లెక్కన  కేరళ రాష్ట్రం సంస్థాపరంగా ముందు చూపుతో వెళ్లడాన్ని అందరం అభినందించాలి.

నిజానికి ఇలాంటి విపత్తుల నివారణకు అవసరమైన బడ్జెట్ కేటాయించడం, సంస్థా పరంగా అందరిని సమాయత్తం చేసి చురుగ్గా అడుగులు వేయడం అత్యవసరం. అక్కడ వేర్వేరు అంచెల్లో పని చేయడానికి తగినంత స్వేఛ్చ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆరోగ్య శాఖ మంత్రితో ముఖ్యమంత్రి సమన్వయం చేసుకుంటూ వెళ్ళడం అక్కడ కనబడుతోంది. తొలిసారిగా కరోనా సోకిన వ్యక్తిని ఆరోగ్యశాఖా మంత్రి పలకరించి ప్రజల్లో ఒక ధైర్యాన్ని కల్పించడం కూడా చూశాం. కానీ మన దగ్గర సామాన్యుల పౌరులపై పోలీసులు విరుచుక పడటం బాధాకరం. పౌరులు రోడ్లపైకి రాకుండా చూడాలన్న ఆర్డర్స్ ఉన్నాయన్న ఏకైక కారణంతో పోలీసులు అసలు సమస్యను శాంతి బద్రతల సమస్యగా మారుస్తున్నారు.

*మరి శాంతి భధ్రతలను కాపాడాలి కదా?

-నిజానికి నేడున్నది హెల్త్ ఎమర్జెన్సీ. శాంతి భద్రతల సమస్య కానే కాదు. మన ముఖ్యమంత్రి అవసరమైతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కూడా ఇస్తామని అనే సరికి పోలీసుల విచక్షణ ఆరోగ్యం నుంచి శాంతి భద్రతల మీదకే పోతుంది తప్పా అది సరైన కట్టడి కాదు.

ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో మంత్రులు, శాసన సభ్యులు, కార్పొరేటర్లు ప్రజల వద్దకు వెళుతున్నారు గానీ వారు కూడా పోలీసుల మాదిరి లాఠీలు ఝలుపించడం విచిత్రం.

*మధ్య తరగతి పరిస్థితి ఎలా ఉంది?

-కరోనా కట్టడి, లాక్ డౌన్ విషయంలో కుటుంబాలు ఇంటి పట్టున ఉండటంతో తలెత్తే పరిస్థితులు కూడా మునుముందు ఎన్నో సమస్యలకు దారి తీస్తాయి.  మనందరం వాటిని ఆర్టిక్యులేట్ చేయవలసి వస్తుంది కూడా. మహిళలు ఇంటి పట్టున తీవ్ర ఒత్తిడికి గురవడం గమనించాలి. డొమెస్టిక్ వయలెన్స్ పెరుగుతోంది. చదువుకున్న పిల్లలు ఇంటి పని, వంట పని విషయంలో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. కాళీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక గృహిణులపై అధిక భారం పడుతోంది. పురుషులు బాధ్యతలు పంచుకోక పోవడం, మహిళలకు ఇదివరకంటే అధికంగా వంట పని పెరగడం, శుబ్రత పాటించాల్సి రావడం వల్ల కడిగినవే కడగడం- ఇట్లాంటి ఎన్నో సమస్యలకు తోడు దీర్ఘకాలికంగా నీటి వనరుల అధిక వ్యయం తదితర విషయాలు రానున్న రోజుల్లో మనకు సమస్యలు తెచ్చి పెడతాయి. ఇలాంటి ఎన్నో అంశాల్లో అందరికీ తగిన కౌన్సిలింగ్ అవసరం పడుతుంది. వివిధ రంగాల్లో నిపుణుల మాటలు మనం వినక తప్పదు.

కరోనా నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవడం అన్న ఏకైక అంశం వెనకాల ఎన్నో అంశాలున్నాయని మనం గ్రహించాలి. ప్రభుత్వం ఎంత పని చేసినా, ఎందరు స్వచ్చందంగా పని చేసినా, ఎవరికీ వారు మరింత బాధ్యతాయుతంగా మెలగాల్సి ఉంది. అందుకే తగిన యాక్టివిజం అన్నది ఈ సమయంలో పరిష్కారమే తప్ప అది ఒత్తిడి కాదని గ్రహించాలి.

*చివరగా, పౌర సమాజానికి మీ సూచన ఏమిటి?

ఇది నిజంగానే ఎమర్జెన్సీ. ఒక్కరం కాదు, వివిధ సామాజిక అంశాలపై పనిచేస్తున్న అనేక మందిమి, సంస్థలుగా, వ్యక్తులుగా గ్రాండ్ లెవల్ లో పనిచేస్తున్నాం. మానవీయ కోణంలో అనేక మంది సామాన్య హైదరాబాద్ పౌరులు స్పందించి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇంకా చాలా రూపాల్లో పని చేయాలి. ప్రాణాలకు తెగించి పనిచేయాల్సిన వాలంటీర్లు ఇప్పుడు అంత్యంత అవసరం . అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజారోగ్యం గురించి కష్టపడాలి. విద్యార్థులు అందుకు ముందుకు రావాలి. వైద్య వ్యవస్థ, పోలీసు వ్యవస్థ సరిపోవనే ఈ మాట చెప్పాల్సి వస్తోంది. ప్రభుత్వ చర్యలను అభినందిస్తూనే పౌరులుగా మన బాధ్యత ముఖ్యం అని ఈ అత్యవసర పరిస్థితిలో తప్పక గ్రహించాలి.

ఇంటర్వ్యూ: కందుకూరి రమేష్ బాబు

Follow Us:
Download App:
  • android
  • ios