న్యూయార్క్: కరోనా వైరస్ మీద పోరాటంలో అమెరికా వైద్యులు అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో హైటెక్ కార్ల తయారీ సంస్థు గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా సైతం వైద్యులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. 

అందుకోసం తన కార్లలో విడి భాగాలతోనే ప్రొటోటైప్ వెంటిలేటర్ల రూపకల్పన ప్రారంభించింది టెస్లా. ఆటోమొబైల్ విడి భాగాలతో ప్రొటో టైప్ వెంటిలేటర్‌ను సంస్థ ప్రొడక్షన్ హౌస్‌లో ఇంజినీర్లు తయారు చేస్తున్న వీడియోను టెస్లా ఆదివారం యూ-ట్యూబ్‌లో అప్ లోడ్ చేసింది. 

టెస్లా ఇంజినీరింగ్ డైరెక్టర్ జోసెఫ్ మార్డాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మేం సొంతంగా వెంటిలేటర్ అభివ్రుద్ధి చేయడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించాం. ప్రత్యేకించి టెస్లా కార్ల విడి భాగాలతోనే దానిని తయారు చేయాలని భావిస్తున్నాం. దేశీయ అవసరాల మేరకు శరవేగంగా వెంటిలేటర్లను ఉత్పత్తి చేసేందుకు మేం సిద్ధం’ అని చెప్పారు. 

ఇంకా టెస్లా డిజైన్ చేసిన ప్రొటోటైప్ వెంటిలేటర్‌ను అమెరికా ఫెడరల్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా ధ్రువీకరించలేదు. ఒకవేళ ఎఫ్డీఏ ఆమోదం పొందితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అమెరికాలో వెంటిలేటర్లను తయారు చేస్తున్న కార్ల తయారీ సంస్థల్లో టెస్లా ఒక్కటి. 

ఇప్పటికే జనరల్ మోటార్స్ (జీఎం), ఫోర్ట్ తదితర సంస్థలు కూడా వెంటిలేటర్ల తయారీ పనిలో నిమగ్నమయ్యాయి. డైసోన్ కూడా న్యూ వెంటిలేటర్‌ను తయారు చేయడంతోపాటు ‘కొవిన్’ అని పేరు పెట్టింది. దాన్ని బ్రిటన్‌లో విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందించింది. వెంటిలేటర్ ద్వారా రోగికి అవసరమైనప్పుడు క్రుత్రిమంగా ఆక్సిజన్ అందజేయడం ద్వారా బతికిస్తారు. 

ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. భారీ స్థాయిలో వెంటిలేటర్ల అవసరం. ప్రస్తుతం అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు మూడు లక్షలు దాటగా, మరణాల సంఖ్య 9620గా నమోదైంది. 

భారతదేశంలోనూ మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కార్ల తయారీ సంస్థలు వెంటిలేటర్ల తయారీకి సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే మహీంద్రా ప్రొటోటైప్ వెంటిలేటర్ ఆవిష్కరించింది.  ఢిల్లీ సమీపంలో అగ్వా హెల్త్ కేర్ సంస్థతో కలిసి మారుతి సుజుకి వెంటిలేటర్ల తయారీకి సిద్ధం అవుతున్నది.