లాక్‌డౌన్లో క్రియేటివిటీ: ఇంటికే నిత్యావసర సరుకుల డెలివరీ చేయనున్న ‘స్విగ్గీ’
కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడటంతో స్విగ్గీ సహా ఇతర ఫుడ్ అగ్రిగేటర్లు ఆర్డర్లు తీసుకోవడం మానేశాయి. కానీ ఇప్పుడు స్విగ్గీ రూట్ మార్చింది. తాజాగా ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించింది. మనకు ఇష్టమైన ఫుడ్ కోసం కాకుండా రోజువారీ నిత్యావసర సరుకుల కోసం స్విగ్గీ ఆర్డర్లు స్వీకరిస్తోంది.
విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వేళ నిత్యావసర సరుకుల కోసం కూడా కేవలం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ఆదేశించింది. దీంతో బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోలేని వారికి తాజా పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.
ఇటువంటి వారి కోసం ఫుడ్ యాప్ స్విగ్గీ కొత్తగా నిత్యావసర వస్తువులను ఇంటికే డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 125 పట్టణాల్లో ఇళ్లకే నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తామని స్విగ్గీ తెలిపింది. వినియోగదారులకు సమీపంలోని దుకాణాల నుంచి వారికి అవసరమైన సరుకులను స్విగ్గీ వారి ఇళ్లకే డెలివరీ చేయనున్నది.
also read కరోనా కట్టడే లక్ష్యంగా... దేశవ్యాప్తంగా ‘సురక్ష’ స్టోర్లు
ఇందు కోసం స్విగ్గీ తన యాప్‌లో ‘గ్రాసరీ’ అనే సెక్షన్ కొత్తగా జోడించింది. దాన్ని క్లిక్ చేసి, మనకు నచ్చిన స్టోర్‌ను ఎంపిక చేసుకుని కావాల్సిన సరుకులను ‘నో కాంటాక్ట్’ డెలివరీ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా స్విగ్గీ పలు బ్రాండ్లతో భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకున్నది.
హిందూస్థాన్ యూనీ లివర్, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ), గోద్రేజ్, డాబర్, విశాల్ మార్ట్, అదానీ విల్మర్స్, సిప్లాలతోపాటు దేశంలోని వివిధ నగరాల్లో అందుబాటులో ఉన్న సరుకులను వినియోగదారుల ఇళ్లకు చేరవేస్తుంది.
స్విగ్గీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) సుందర్ వివేక్ మాట్లాడుతూ నిత్యావసర సరుకులను కూడా తమ యాప్ లో జత చేయాలని తాము ఎప్పటి నుంచే అనుకుంటున్నామని చెప్పారు. తమ వినియోగ దారులకు అధిక ప్రయోజనాలు కల్పించాలని భావించామన్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులను వినియోగదారుల ఇళ్లకు డెలివరీ ప్రక్రియ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని స్విగ్గీ సీఓఓ సుందర్ వివేక్ చెప్పారు. దీన్ని తాము కొనసాగిస్తామని, లాక్ డౌన్ వేళ పౌరులకు కనీస మద్దతు ఇవ్వడమే తమ ఉద్దేశం అని తెలిపారు. ఇప్పటికే స్విగ్గీ ప్రత్యర్థి సంస్థ జొమాటో 80 నగరాలకు పైగా గ్రాసరీ వస్తువులు డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.