అక్షయతృతీయ స్పెషల్ : బంగారు ఆభరణాలపై ఆన్ లైన్ ఆఫర్లు..

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ వల్ల అక్షయతృతీయ వేళ పలు బంగారు ఆభరణాల షోరూమ్‌లు ఆన్ లైన్ విక్రయాలు చేపట్టాయి. పలు రకాల ఆఫర్లు ప్రకటించాయి. 

Should you buy gold online this Akshaya Tritiya amid coronavirus lockdown?

ఆడబడుచులకు పుత్తడి అంటే ఎంతో మక్కువ. కానీ ప్రస్తుతం అది ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గం కూడా. ఇక శుభముహూర్తాన బంగారం కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని పెద్దల నమ్మకం. 

కానీ ఈ ఏడాది అక్షయతృతీయ వేళ.. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీనివల్ల పసిడి దుకాణాలు మే మొదటి వారం వరకు తెరుచుకునే అవకాశాలే లేకపోవడమే దీనికి కారణం. 

ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో మాత్రమే బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు వీలు ఉంది. పలు సంస్థలు, షోరూమ్‌లు ఆన్ లైన్ ద్వారా బంగారం అమ్మకాలకు తెర తీశాయి. ఇందుకోసం ఈ నెల 26వ తేదీ వరకు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారు వివిధ బంగారం షాపుల వెబ్ సైట్లలోకి వెళ్లి నగదు చెల్లించవచ్చు. 

అలా ఆన్ లైన్‌లో కొన్న వారికి అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసినట్లు సర్టిఫికెట్ వస్తుంది. బంగారం దుకాణాలు తెరుచుకున్న తర్వాత కొనుగోలు చేసిన వారు దుకాణాలకు వెళ్లి బంగారం తెచ్చుకోవచ్చు. లేకపోతే ఇంటికే తెప్పించుకునేందుకు వెసులుబాటు ఉంది. 

మిగతా సంస్థల మాదిరిగానే జోయాలుక్కాస్‌.. ఆన్‌లైన్‌ అమ్మకాలను ప్రారంభించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అక్షయ తృతీయ సందర్భంగా తమ కస్టమర్ల కోసం ఆన్‌లైన్‌ విక్రయాలను అందుబాటులోకి తెచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. 

శని, ఆదివారాల్లో జోయాలుక్కాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా తమ ఇళ్ల నుంచే బంగారాన్ని, నచ్చిన నగలను కొనుగోలు చేయవచ్చని వివరించింది. బంగారు ఆభరణాలపై ప్రతీ గ్రాముకు రూ.50, వజ్రాభరణాలపై డైమండ్‌ విలువలో 20 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని స్పష్టం చేసింది.

ఎస్బీఐ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 15 శాతం క్యాష్‌‌బ్యాక్‌ లభిస్తుందని జాయ్ అలుక్కాస్ తెలిపింది. అమెజాన్‌, డబ్ల్యూఓఓహెచ్ఓఓ డాట్ ఐన్ తదిరత ఆన్‌లైన్‌ సైట్స్‌ ద్వారా కొనుగోళ్లు జరిపిన కస్టమర్లకు ప్రత్యేక బహుమతి వోచర్లు, ఈ-ఓచర్లు అందుతాయని పేర్కొన్నది. 

మలబార్ గోల్డ్ డైమండ్స్ కూడా ఆన్ లైన్ విక్రయాలు అందుబాటులోకి తెచ్చింది. బంగారు ఆభరణాలపై 30 శాతం, వజ్రాభరణాలపై 20 శాతం తగ్గింపు అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ.15,000, అంతకన్నా ఎక్కువ మొత్తాలపై కొనుగోలు చేస్తే ఐదు శాతం నగదు వెనక్కి ఇవ్వనున్నది. 

డబ్బు చెల్లించిన రోజు, ఆభరణాలు తీసుకునే రోజు.. ఎప్పుడు తక్కువ ధర ఉంటే అది వర్తిస్తుంది. ఇంతకుముందు టాటా సన్స్ అనుబంధ సంస్థ తనిష్క్‌తోపాటు కల్యాణ్ జ్యువెల్లర్స్ కూడా ఆఫర్లు అందిస్తోంది.

అక్షయ తృతీయ నేపథ్యంలో బులియన్ మార్కెట్లో వరుసగా మూడో రోజు గురువారం కూడా బంగారం ధరలు పైపైకి దూసుకెళ్లాయి. ఎంసీఎక్స్ మార్కెట్లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో పది గ్రాముల ధర 0.2 శాతం పెరిగి రూ.46,511కు పెరిగింది. గత రెండు సెషన్లలో పది గ్రాముల బంగారం ధర రూ.1300 పెరిగింది. గత వారం పది గ్రాముల బంగారం ధర రూ.47 వేల పై చిలుకు పలుకడంతో దేశీయంగా డిమాండ్ తగ్గింది. 

అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పడిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితికి తోడు తాజాగా అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నదన్న వార్తల నేపథ్యంలో పసిడి ధర ఔన్స్ పై 0.4 శాతం తగ్గి 1724.04 డాలర్లకు పడిపోయింది. వెండి ఔన్స్ ధర కూడా 0.6 శాతం తగ్గి 15.21 డాలర్లకు పతనమైంది. మరోవైపు అమెరికా చట్టసభ ప్రతినిధుల సభ గురువారం 484 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios