Asianet News TeluguAsianet News Telugu

వచ్చేనెలలో రిలయన్స్ గ్యాస్‌ ఉత్పత్తి... పెట్రోల్‌ కంటే చౌకగా విమాన ఇంధనం..

కేజీ-డీ6 బ్లాక్ పరిధిలో కొత్తగా గుర్తించిన బావుల్లో సహజ వాయువు ఉత్పత్తి కోసం రిలయన్స్, దాని బ్రిటన్ సంస్థ బీపీ-పీఎల్సీ సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ప్రతి మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌ (ఎంఎంబీటీయూ) గ్యాస్‌ ధర 2.2 డాలర్ల వరకు ఉండొచ్చని రిలయన్స్ భావిస్తోంది,
 

Reliance should starts gas production from June in KG-D6 Block
Author
Hyderabad, First Published May 4, 2020, 1:24 PM IST

న్యూఢిల్లీ: తూర్పు తీరంలోని కృష్ణా -గోదావరి (కేజీ) బేసిన్‌లో ఉన్న డీ-6 బ్లాక్‌లో కొత్తగా గుర్తించిన క్షేత్రాల్లో జూన్‌ నుంచి సహజ వాయువును ఉత్పత్తి చేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌), దాని బ్రిటన్ భాగస్వామ్య సంస్థ బీపీ పీఎల్‌సీ సిద్ధం అవుతున్నాయి.  

గ్యాస్ ఉత్పత్తి కోసం రిలయన్స్ ప్రయత్నాలు సన్నద్ధం
కరోనా ‘లాక్‌డౌన్‌’ వల్ల అవసరమైన మెటీరియల్‌, కార్మికులు, సాంకేతిక నిపుణుల రాకపోకలపై ఆంక్షలు ఉండటంతో జూన్‌ చివరి నుంచి డీ6లోని ఆర్‌-సిరీస్‌ క్షేత్రంలో కొత్తగా గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలని రిలయన్స్ భావిస్తోంది. ప్రస్తుత బ్రెంట్‌ చమురు ధరల (బ్యారల్‌ ధర 26 డాలర్లు) ప్రకారం చూస్తే ఆర్‌-సిరీస్‌ క్షేత్రం నుంచి ఉత్పత్తి చేయనున్న ప్రతి మిలియన్‌ బ్రిటిష్‌ థర్మల్‌ యూనిట్‌ (ఎంఎంబీటీయూ) గ్యాస్‌ ధర 2.2 డాలర్ల వరకు ఉండొచ్చని భావిస్తోంది,

ఫిబ్రవరి నుంచి కేజీ-డీ6 పాత క్షేత్రాల్లో ఉత్పత్తి నిలిపివేత
కేజీ-డీ6 బ్లాక్‌లోని పాత క్షేత్రాల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఉత్పత్తిని నిలిపి వేయటంతో కొత్త క్షేత్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని రిలయన్స్ వెల్లడించింది. అందులో భాగంగానే ఆర్‌- క్లస్టర్‌, శాటిలైట్స్‌, ఎంజే ప్రాజెక్టులపై విస్తృతంగా పనిచేస్తున్నట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. 

2021లో శాటిలైట్స్ ద్వితియార్థంలో ఉత్పత్తి ప్రారంభం
ఇందులో ఆర్‌-క్లస్టర్‌లో ఉత్పత్తిని ఈ ఏడాదే ప్రారంభించనుండగా శాటిలైట్స్‌లో 2021 ద్వితీయార్థంలో, ఎంజే క్షేత్రంలో ఉత్పత్తిని 2022 నాటికి ప్రారంభించే అవకాశం ఉందని రిలయన్స్ పేర్కొంది. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ మూడు క్షేత్రాల నుంచి రోజుకు గరిష్ఠంగా 28 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్ల (ఎంఎంఎస్ఎండీ) సహజ వాయువును ఉత్పత్తి చేయవచ్చని రిలయన్స్ అంచనా వేస్తోంది.

also read  లాక్‌డౌన్ ఎఫెక్ట్: జీడీపీపై రోజుకు రూ.60 వేల కోట్ల నష్టం...

పెట్రోల్‌ కంటే చౌక ధర 
అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్‌ ధరల తగ్గుదల ప్రభావంతో విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధర 23 శాతం మేరకు తగ్గింది. ప్రస్తుతం ఏటీఎఫ్‌ ధర పెట్రోల్‌, డీజిల్‌ ధర కన్నా మూడింట ఒక వంతు మాత్రమే ఉంది. ఇప్పటికి వరుసగా 50 రోజులుగా ఈ ధరలు స్థిరంగా ఉండిపోయాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.69,59, లీటర్‌ డీజిల్‌ ధర రూ.62.29 ఉండగా ఏటీఎఫ్‌ ధర రూ.22.54 పలుకుతోంది. 

ఇతర మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఇలా
ఇతర మెట్రో నగరాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరల తీరు ఇలాగే ఉంది. ఫిబ్రవరి నుంచి వరుసగా ఆరు విడతలుగా ఏటీఎఫ్‌ ధరలను ఆయిల్‌ కంపెనీలు తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటుండటంతో దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్చి 16 నుంచి ఎలాంటి మార్పు లేకుండా కేంద్ర ప్రభుత్వ చమురు కంపెనీలు ఫ్రీజ్‌ చేశాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios