బాబాయ్ వెంటే అబ్బాయి.. కరోనా నివారణకు రామ్ చరణ్ విరాళం
బాబాయ్ పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా వైరస్ రిలీఫ్ కోసం 70 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. గురువారం ట్విటర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్ తన తొలి ట్వీట్ లో ఈ విరాళాన్ని ప్రకటించాడు.
కరోనా ప్రభావంతో దేశం అల్లకల్లోలమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 650కి పైగా కేసులు నమోదు కావటం, 15 మంది మరణించటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. అయితే రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మరిన్ని చర్యల దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నాయి. ఇక కరోనా కారణంగా అన్నిరంగాలు కుదేలవుతున్నాయి. నష్టనివారణ చర్యల కోసం భారీ ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.
తెలుగు సినీ రంగం నుంచి హీరోలతో పాటు దర్శకులు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 కోట్ల భారీ విరాళం ప్రకటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ 20 లక్షలు ప్రకటించాడు. అనిల్ రావిపూడి, నితిన్ లు పది లక్షల చొప్పున విరాళాలు ప్రకటించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కరోనా నివారణ చర్యల కోసం తన వంతు సాయం అందించాడు. ఈ రోజు ట్విటర్ లోకి అధికారికంగా అడుగుపెట్టి చరణ్ తొలి ట్వీట్ లో తన సాయాన్ని ప్రకటించాడు.
`పవన్ కళ్యాణ్ ఇన్సిపిరేషన్‌తో నేను నా వంతుగా 70 లక్షల రూపాయలను కేంద్రంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళంగా అందించనున్నట్టుగా ప్రకటించాడు. పీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు ఈ మొత్తాన్ని అందించనున్నట్టుగా తెలిపాడు. ఓ బాధ్యత గల పౌరులుగా అందరూ రూల్స్ పాటించండి` అంటూ ట్వీట్ చేశాడు చరణ్.
ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నాడు. అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.