Asianet News TeluguAsianet News Telugu

ఫోన్ పే కొత్త ఫీచర్.. డాక్టర్లతో ఆన్‌లైన్ కన్సల్టింగ్‌కు యాప్‌..

కరోనా సంక్షోభం వేళ రోగులకు డాక్టర్లతో వైద్య సేవలందించేందుకు డిజిటల్ పేమెంట్స్ సంస్థ ‘ఫోన్ పే’.. డాక్స్ యాప్‌తో జత కట్టింది. రోగులకు సంబంధిత భాషల్లో వైద్య సేవలపై సలహాలు అందుబాటులోకి వస్తాయి.

PhonePe new feature to enable online doctor consultations
Author
Hyderabad, First Published Apr 30, 2020, 1:57 PM IST

న్యూఢిల్లీ: ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిణమించిన కరోనా మహమ్మారి పలు రకాల మార్పులు తీసుకొస్తున్నది. ఇప్పటి వరకు ఆన్ లైన్‌లో వస్తువుల కొనుగోళ్లు, యుటిలిటీ సేవల చార్జీల చెల్లింపులు జరిపేవారం. తాజాగా డాక్టర్లతో ఆన్ లైన్ సంప్రదింపుల కోసం చెల్లింపుల సంస్థ ఫోన్ పే భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నది.

కానీ తాజాగా కరోనా వైరస్ సోకిన రోగులకు చికిత్స చేయడానికి ‘డాక్స్ ఆప్’ రోగుల అవసరాలకు తగిన సేవలు అందించడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పేతో జట్టు కట్టింది.

ప్రస్తుత సంక్షోభ వేళ భారతీయులకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సహాయ పడేందుకు డాక్స్ఆప్ నిర్ణయం తీసుకున్నది. డాక్స్ఆప్ ఇప్పుడు ఫోన్ పే లోని స్విచ్ వేదికలో ప్రత్యక్షంగా సేవలు అందిస్తున్నది. ఈ వేదిక ద్వారా కస్టమర్లు అప్పటికప్పుడే స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదించవచ్చు. 

వినియోగదారులకు అవగాహన పెంచడంకోసం లాక్‌డౌన్ సందర్భంగా ఫోన్ పే నిత్యావసరాల విభాగంలో డాక్స్ఆప్ కనిపిస్తుంది. 20 కోట్ల మందికి పైగా ఉచితంగా ఫోన్ పే కస్టమర్లకు కరోనా సంబంధిత సందేహాలకు డాక్స్ఆప్ జవాబులివ్వడంతోపాటు, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నది. 

అంతేకాక కరోనాయేతర వ్యాధులకు సలహాలకోసం ఫీజుల్లో 90% వరకు డిస్కౌంట్ అందించనుంది. దేశవ్యాప్తంగా 3.5 లక్షలకు పైగా తమ సేవలు అందించడానికి  సిద్ధంగా ఉన్నామని  ఫోన్ పే స్విచ్ విభాగం అధిపతి రితురాజ్ రౌతేలా తెలిపారు.

డాక్స్ఆప్, ఫోన్‌పే భాగస్వామ్యంలో లక్షల మంది వినియోగ దారులకు వారి ఇంటిలోనే భద్రంగా ఉంటూ ఏదైనా ఆరోగ్య సమస్యలపై విశ్వసనీయ డాక్టర్లను సంప్రదించే సౌకర్యాన్ని అందిస్తున్నామని ఫోన్ పే స్విచ్ విభాగం అధిపతి రితురాజ్ రౌతేలా పేర్కొన్నారు. 

డాక్స్ ఆప్ సీఈఓ సతీష్ కన్నన్ మాట్లాడుతూ ‘మానవ సమాజానికి సరికొత్త శతృవుగా పరిణమించిన కరోనాతో కలసి పోరాడేందుకు మనమంతా కలసి కృషి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమైంది. ఫోన్ పే సహాయంతో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉచితంగా సేవలు అందించడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాం’ అని అన్నారు.

డాక్స్ ఆప్‌లో ఎవరైనా వ్యక్తులు తమ మాతృభాష లేదా తమకు సౌకర్యవంతమైన మరేదైనా భాషలో చాట్, కాల్ లేదా వీడియో ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదించవచ్చు. అంతేకాకుండా మెడిసిన్స్ కొనడానికి కూడా వినియోగదారులకు ఈ వేదిక వీలు కల్పిస్తున్నది.

రోగులు తమ మాత్రుభాషలో వైద్యుల సలహాలు తీసుకునేందుకు ఫోన్ పే సహకరిస్తుంది. డాక్స్ యాప్‌తో చాటింగ్, కాల్, వీడియో ద్వారా డాక్టర్లతో అనుసంధానం కావచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios