బడ్జెట్ పై ఎఫెక్ట్ కేవలం రూ.2.02 లక్షల కోట్లే.. ద్రవ్యలోటుపైనే ఫోకస్..

కరోనాతో తలెత్తిన సంక్షోభానికి విరుగుడుగా దేశ ఆర్థిక పునరుత్తేజానికి కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ కేవలం అంకెల గారడీగానే ఉన్నదన్న విమర్శలు ఉన్నాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ వంటి అంతర్జాతీయ అధ్యయన సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ప్రభుత్వ ప్యాకేజీ రూ.3.22 లక్షల కోట్లేనని విపక్షాలు ధ్వజమెత్తాయి. గమ్మత్తేమిటంటే ఈపీఎఫ్ నుంచి సభ్యులు తీసుకున్న సొమ్మును కూడా కేంద్రం తన ప్యాకేజీ ఖాతాలో కలిపేసుకోవడమే. కేంద్రం తీరుపై వ్యాపార, పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 

only just Rs 2.02 lakh cr effect on budget: EY report

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్‌ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీపై అంతర్జాతీయ సంస్థలు పెదవి విరుస్తున్నాయి. ఇందులో బడ్జెట్‌ ఖర్చు రూ.2.02 లక్షల కోట్లు మాత్రమేనని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ (ఈవై) ఒక నివేదికలో పేర్కొంది. మొత్తం ప్యాకేజీలో ఇది 10 శాతం కూడా ఉండదని స్పష్టం చేసింది.

కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని అదుకునేందుకు జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ.20 లక్షల కోట్ల   ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ఐదు విడతలుగా ప్రకటించింది. ప్రభుత్వం కొండంత ఇస్తామని చెప్పి  గోరంత ఇచ్చిందని ఈవై పరోక్ష విమర్శలు గుప్పించింది. 

ఈ ఉద్దీపన ప్యాకేజీలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ప్రకటించిన నిధుల చలామణి పెంపు చర్యలతోనే రూ.8.01 లక్షల కోట్లు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని ఈవై గుర్తు చేసింది.

ఈవై ఇండియా ఛీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాత్సవ స్పందిస్తూ.. ’ఈ ప్యాకేజీ ఖర్చులో కేవలం 10 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వంపై అదనపు భారం మోపుతుంది. మిగతా నిధులు ఆర్బీఐ ప్రకటించిన ద్రవ్య చలామణి పెంపు చర్యలు, ప్రభుత్వ రుణ హామీ పథకం, బీమా పథకాల ద్వారా సమకూరతాయి’ అని అన్నారు. 

కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీ రూ.20 లక్షల కోట్లుగా ఉన్నా.. బడ్జెట్‌పై ప్రభావం మాత్రం రూ.1.50 లక్షల కోట్లేనని బార్క్‌లేస్‌ దేశీయ ప్రధాన ఆర్థికవేత్త రాహుల్‌ బజోరియా తెలిపారు. జీడీపీలో ఇది 0.5 శాతమేనని గుర్తుచేశారు. 

ఈ అంచనాలు కరోనా సంక్షోభానికి సాయం కంటే ద్రవ్యలోటు కట్టడికే మోదీ సర్కారు ప్రాధాన్యత ఇచ్చిందన్న విషయాన్ని ధ్రువపరుస్తుండటం గమనార్హం. మొత్తం ప్యాకేజీలో ఆర్బీఐ గతంలో ప్రకటించిన నిర్ణయాల విలువే రూ.8 లక్షల కోట్లు.
 
కాగా, ప్యాకేజీపై రిటైలర్ల సంఘం కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమను ఏమాత్రం ఆదుకోలేదని భారతీయ రిటైలర్ల సంఘం సీఈవో కుమార్‌ రాజగోపాలన్‌ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు.

also read అందరికీ అందుబాటులోనే వ్యాక్సిన్ ధర.. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ.. కేవలం అంకెల గారడీనే అని విపక్షాలు ధ్వజమెత్తాయి. రూ. 20 లక్షల కోట్లలో ప్రభుత్వం అందించిన ఉద్దీపన రూ.3.22 లక్షల కోట్లు మాత్రమేనని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విమర్శించింది.

మోదీ సర్కార్  చెప్తున్నట్లుగా దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ దాదాపు 10 శాతం ఎంతమాత్రం కాదని, 1.6 శాతమేనని ఆదివారం ఆ పార్టీ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ మండిపడ్డారు. దేశ ప్రజలను మోసపూరిత, అసత్య, జిత్తులమారి ప్రకటనలతో కేంద్ర ప్రభుత్వం మభ్యపెట్టాలని చూస్తున్నదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 ‘కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోడానికి, పేద ప్రజలు, చిన్న, మధ్యతరహా సంస్థల చేతుల్లోకి నగదును అందించేందుకు ప్రధాని మోదీ తప్పక మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందే’ అని శర్మ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్‌ చేశారు. 

మోదీ ఈ విషయంలో ఊరుకుంటే సరిపోదని, దీనిపై స్పందించాలని ఆనంద్ శర్మ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చకు సవాల్‌ విసిరారు. ఇక మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం ఈ ఉద్దీపన ప్యాకేజీ ప్రభుత్వ అదనపు ఆదాయం, ఖర్చుల కోసం ప్రకటించిందే తప్ప కరోనా బాధిత రంగాల కోసం కాదన్నారు.

కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కూడా ఇది పేద, రైతు, కార్మిక, వ్యాపార వ్యతిరేక ప్యాకేజీ అని దుయ్యబట్టారు. మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ సైతం ట్విట్టర్‌ వేదికగా కొవిడ్‌-19 ప్యాకేజీపై నిప్పులు చెరిగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios