Asianet News TeluguAsianet News Telugu

ప్యాకేజీపై అసంత్రుప్తి: భారత్‌కు లాభిస్తుందని చెప్పలేం.. అభిజిత్ కుండబద్ధలు

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీపై నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమె రికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు తమ జీడీపీలో అధిక శాతం ఖర్చు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ వాణిజ్యం చైనా చేజారినంత మాత్రాన అది భారత్​కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు.

Not sure whether India will gain if businesses shift from China due to COVID-19: Abhijit Banerjee
Author
Hyderabad, First Published May 13, 2020, 12:00 PM IST

న్యూఢిల్లీ: ప్రపంచ వాణిజ్యం చైనా చేజారినంత మాత్రాన... భారత్​ లాభపడుతుందని కచ్చితంగా చెప్పలేమని  ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపైనా ఓ న్యూస్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అసంత్రుప్తి వ్యక్తం చేశారు.


‘కరోనా పుట్టుకకు చైనా కారణమని ప్రపంచమంతా భావిస్తోంది. అందువల్ల ప్రపంచ వాణిజ్యం చైనా చేజారిపోవచ్చని అంతా భావిస్తున్నారు. ఫలితంగా ఇది భారత్​కు లాభం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది నిజం కాకపోవచ్చు’ అని ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. 

చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే, ఆ దేశ ఉత్పత్తులు చౌకగా లభిస్తాయని అన్నారు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఆ దేశ ఉత్పత్తులనే కొనడం కొనసాగిస్తారని అభిజిత్ బెనర్జీ స్పష్టం చేశారు. కరోనాపై పోరులో తగిన మార్గనిర్దేశానికి పశ్చిమ బెంగాల్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడుగా అభిజిత్​ బెనర్జీ ఉన్నారు.

కరోనా ధాటికి అతలాకుతలమైన పేద ప్రజానీకానికి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1.70 లక్షల కోట్ల ప్యాకేజీపై అభిజిత్​ బెనర్జీ భిన్నంగా స్పందించారు. అమెరికా, యూకే, జపాన్ లాంటి దేశాలు తమ జీడీపీలో అధిక వాటాను ఖర్చు చేస్తున్నాయని గుర్తు చేశారు.

‘కేంద్ర ప్రభుత్వం దేశ జీడీపీలో ఒక శాతం కన్నా తక్కువ... అంటే రూ.1.70 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని యోచిస్తోంది. వాస్తవానికి ఈ ఖర్చు మరింతగా పెంచాల్సి ఉంది’ అని అభిజిత్ బెనర్జీ అన్నారు.దేశ ప్రజల్లో అధికశాతం మందికి కనీస కొనుగోలు శక్తి లేదని.. అదే అసలైన సమస్య అని పేర్కొన్నారు.

also read లాక్‌ డౌన్ దెబ్బ: మీడియా అండ్ వినోద రంగాలు ఢమాల్... క్రిసిల్ అంచనా

‘ప్రజలకు కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల వస్తువులు, సరుకుల కొనుగోలుకు డిమాండ్ ఉండదు. అందువల్ల ప్రభుత్వం దశలవారీగా ప్రజలకు డబ్బు అందించాలి’ అని అభిజిత్​ బెనర్జీ వ్యాఖ్యానించారు. దాని వల్ల వారు ధనవంతులేమీ అయిపోరని అన్నారు.

కానీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అభిజిత్​ బెనర్జీ చెప్పారు. ఒక వేళ వారు ఖర్చు చేయకపోయినా ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదని వ్యాఖ్యానించారు. వలస కార్మికుల సంక్షేమం కేంద్రం బాధ్యత అని అభిజిత్ పేర్కొన్నారు.

నిలువ నీడలేక, చేతిలో డబ్బు లేక సతమతమవుతున్న వారికి అత్యవసరంగా రేషన్​ కార్డులు జారీచేయాల్సిన అవసరం ఉందని అభిజిత్​ బెనర్జీ స్పష్టం చేశారు. కనీసం మూడు, నుంచి ఆరు నెలల పాటు వారికి నిత్యావసరాలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కరోనా సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్​లో పనికి కొరత ఏర్పడలేదని బెనర్జీ స్పష్టం చేశారు. ఢిల్లీ, బెంగళూరులోని కార్మికులను తమ స్వస్థలాలకు వెళ్లవద్దని యాజమాన్యాలు కోరుతున్న విషయాన్ని ఆయన ఉదహరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios