2,3 రోజుల్లో వారికి ప్యాకేజీ: కేంద్ర మంత్రి..ఆదుకునేందుకు రూ.4.5 లక్షల కోట్లు...

రెండు, మూడు రోజుల్లో పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు మరో రెండు, మూడు రోజుల్లో ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. మరోవైపు వివిధ రంగాల పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.4.5 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని ఫిక్కీ డిమాండ్ చేసింది.

Nitin Gadkary Says Expect Financial Package From Government

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తితో సంక్షోభంలో కూరుకున్న ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఆర్థిక ప్యాకేజ్‌ను ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రుణాలపై నెలసరి వాయిదాల చెల్లింపు విషయమై ఆర్బీఐ మూడు నెలల మారటోరియం విధించినా పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నందున కేంద్ర ప్యాకేజ్‌ అనివార్యమని స్పష్టం చేశారు.

పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని,అయితే ప్రభుత్వానికి ఉన్న పరిమితులనూ గుర్తెరగాలని చిన్న, మధ్య తరహా పరిశమ్రలు, రవాణా, హైవే శాఖల  మంత్రి  నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. మహమ్మారి ప్రభావానికి లోనైన ప్రతి ఒక్కరినీ కాపాడేందుకు తాము చేయగలిగినంతా చేస్తున్నామని స్పష్టం చేశారు.

భారత్‌ ఆర్థిక వ్యవస్ధకంటే పెద్దవి అయినందునే అమెరికా. జపాన్‌ భారీ ప్యాకేజీ ప్రకటించాయని నితిన్ గడ్కరీ గుర్తుచేశారు. కరోనా మహమ్మారితో ప్రభావితమైన వారికి ఊరటగా ఆర్‌బీఐ మార్చి 27న మూడునెలల పాటు ఈఎంఐ చెల్లింపులను నిలుపుదల చేస్తూ ప్రకటన చేసిందని అన్నారు.

ఆదాయం పన్ను, జీఎస్టీ రిఫండ్‌లను తక్షణమే ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని తాను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించానని వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరిశ్రమకు చేయూత ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ప్యాకేజీని ప్రకటిస్తుందని  వెల్లడించారు. ఇదిలా ఉంటే, లాక్‌డౌన్‌తో కుప్పకూలిన పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ మరింత ఊపందుకుంది.

also read లాక్ డౌన్ పొడిగిస్తే.. ఆర్థిక ఆత్మహత్యలే.. తేల్చేసిన ఆనంద్ మహీంద్రా

ఇందుకోసం వెంటనే రూ.4.5 లక్షల కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రభుత్వానికి భారత పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫిక్కీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఫిక్కీ ప్రెసిడెంట్‌ సంగీతా రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రస్తుతం పారిశ్రామిక రంగాన్ని వేధిస్తున్న పెద్ద సమస్య నిధుల కొరతే అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

ప్రస్తుతం పలు రకాల సమస్యల నుంచి గట్టెక్కేందుకు కంపెనీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రిఫండ్స్‌, ఇతర బకాయిలు రూ.2.5 లక్షల కోట్లు సత్వరమే విడుదల చేయాలని ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతారెడ్డి కోరారు. దీంతో కంపెనీలు ఎదుర్కొంటున్న నిధుల కొరత కొంతలో కొంతైనా తీరుతుందని పేర్కొన్నారు. 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఎదుర్కొంటున్న సమస్యలనూ సంగీతా రెడ్డి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రభుత్వం వెంటనే ఆర్థికంగా ఆదుకోకపోతే ఈ కంపెనీలు గట్టెక్కడం కష్టమన్నారు. 

ఎంఎస్ఎంఈలతోపాటు కరోనా లాక్‌డౌన్‌తో కుప్పకూలిన హెల్త్‌కేర్‌, విమాన యానం, పర్యాటక రంగాలకూ ప్రభుత్వ చేయూత తప్పనిసరన్నారు. అలాగే పెద్ద కంపెనీలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై హామీ కోసం ఏటా రూ.10వేల కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఫిక్కీ సూచించింది. స్టార్టప్‌లు, నిర్మాణ, ఉత్పత్తి రంగాలకు చెందిన కంపెనీలను ఆకర్షించేందుకు ‘స్వయం సమృద్ధి నిధి’ పేరుతో మరో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కూడా ఫిక్కీ సూచించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios