Asianet News TeluguAsianet News Telugu

చైనాలో వాటికి ఫుల్ డిమాండ్.. లాక్‌డౌన్ తర్వాత పెరగనున్న కార్ల కొనుగోళ్లు...ఎందుకో తెలుసా ?

కరోనా వైరస్ మనకెన్నో గుణపాఠాలు నేర్పింది.. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని స్పష్టం చేసింది. ఇది ప్రజా రవాణా వ్యవస్థను నిరుత్సాహా పరిచే పరిణామమే. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వ్యక్తిగత కార్లు, బైక్స్ కొనుగోళ్లు పెరుగుతాయని ఆటో దిగ్గజ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. చైనాలో ప్రస్తుతం వ్యక్తిగత కార్లు, వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉండటమే కారణం.
Maruti expects car boom after coronavirus lockdown ends
Author
Hyderabad, First Published Apr 15, 2020, 10:47 AM IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరు కోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్ వల్ల వివిధ రంగాల పరిశ్రమలు తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. లాక్‌డౌన్ తొలిగించిన తర్వాత.. పరిస్థితులు కుదుట పడిన మీదట తమ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయని ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. 

ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రజలకు అలవాటు చేసిన సామాజిక (భౌతిక) దూరమే అందుకు కారణం అని ఆటోమొబైల్ సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరులతో కలిసి ప్రయాణించడానికి భయపడతారన్ని ఆటో దిగ్గజ సంస్థల అధినేతలు అభిప్రాయ పడుతున్నారు.

దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ లాక్ డౌన్ ముగిసిన తర్వాత వాహనాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు మరో ప్రయాణికుడితో కలిసి ప్రయాణించడానికి భయపడటమే దీనికి కారణమని అభిప్రాయపడ్డారు.

గతంలో మాదిరిగా భారతీయులు అలాగే ఉండరని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గ పేర్కొన్నారు. వాహనాల కొనుగోళ్ల విషయంలో వారి ఆలోచనల్లోనూ మార్పులు వస్తాయని అభిప్రాయ పడ్డారు. ఆర్థిక స్తంభన తర్వాత గతంతో పోలిస్తే చైనీయులు వ్యక్తిగత ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో భార్గవ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

అసలు లాక్ డౌన్‌కు ఏడాది ముందు నుంచే ఆటోమొబైల్ కంపెనీల విక్రయాలు ఆశాజనకంగా ఏమీ లేదు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద సంస్థ అయిన మారుతీ సుజుకి అమ్మకాలు 52 శాతం పతనం అయ్యాయి.

లాక్ డౌన్ విధించిన తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, టాటా మోటార్స్ తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ కూడా ఉత్పత్తిని నిలిపివేసింది. 

కరోనా మహమ్మారిని కట్టడి చేసిన తర్వాత మారుతి సుజుకి కంపెనీలో ఉత్పత్తులు ప్రారంభమైతే మా్తరమే ఉద్యోగుల సంఖ్యలో కోత విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తదనుగుణంగానే కార్ల ఉత్పత్తి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఉత్పత్తులను నిలిపివేయడంతోపాటు పెట్టుబడుల్లో కోత విధించడంతో  నాలుగు లక్షలకు పైగా ఉద్యోగుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి నిలిపివేయడం వల్ల రోజువారీగా రూ.2300 కోట్ల నష్టం వాటిల్లుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) పేర్కొంది.
 
Follow Us:
Download App:
  • android
  • ios