Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ ఉద్యోగుల్లో కరోనా కలవరం...భవిష్యత్తుపై ఆందోళన...ఒత్తిడికి గురి కాకుండా క్లాస్​లు..

కరోనా మహమ్మారి అన్ని రంగాలను కుదిపేస్తోంది. తమ ఉద్యోగం ఉంటుందో, పోతుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. పలు సంస్థలు ఇప్పటికే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాయి. ప్రోత్సాహాలు నిలిపివేశాయి. ఉద్యోగులు ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా కొన్ని సంస్థలు 'హ్యాపీనెస్ తరగతులు' నిర్వహిస్తూ.. తమ ఉద్యోగులకు హాయిని కల్పిస్తున్నాయి.
 
Lockdown side effects: Fear of job losses, salary cuts and delayed appraisals
Author
Hyderabad, First Published Apr 13, 2020, 2:48 PM IST
కరోనా సంక్షోభం, దేశవ్యాప్తంగా లాక్​డౌన్ కారణంగా ఉద్యోగులు తమ భవిష్యత్తుపై భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు జీతాల్లో కోతలు విధించాయి. ఏప్రిల్​లో ఇవ్వాల్సిన పోత్సాహాలను నిలిపివేశాయి. నియామకాలను ఆపేశాయి. 

ఈ నేపథ్యంలో తమ ఉద్యోగం ఉంటుందో, పోతుందోనని అనేక మంది ఒత్తిడికి లోనవుతున్నారు.భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేందుకు కొన్ని సంస్థలు తమ సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మానసిక నిపుణులతో 'హ్యాపీనెస్ సెషన్లు' నిర్వహిస్తున్నాయి. 

వ్యాపారం సంబంధ విషయాలను తరచూ కార్పొరేట్ సంస్థలు చర్చిస్తున్నాయి. ఎలాంటి అభద్రతకు గురి కావద్దని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయాల్లో ఎక్కువ సమయం ఆఫీస్​లో గడిపిన వారికి అదనపు ప్రోత్సాహాలిస్తున్నాయి. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నాయి.

ఉద్యోగులు, సంస్థలు గతంలో ఎన్నడూ చూడని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. లాక్​డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక ఉద్యోగుల మానసిక సవాళ్లు మరింత తీవ్రతరం అవుతున్నాయని అంటున్నారు.

ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగా​ బిజినెస్​ హెడ్ సుదీప్​ సేన్ ప్రతిస్పందిస్తూ.. ‘ప్రస్తుత పరిస్థితులతో ఉద్యోగులతోపాటు సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ప్రోత్సాహకాలపై సంస్థలు ఏ నిర్ణయం తీసుకుంటాయో ఇప్పుడే చెప్పలేం. కొవిడ్-19 ప్రభావం వ్యాపార సంస్థలపై తీవ్రంగా ఉంది’ అని పేర్కొన్నారు. 

also read కరోనా కట్టడే లక్ష్యంగా... దేశవ్యాప్తంగా ‘సురక్ష’ స్టోర్లు 

లాక్​డౌన్ వేళ రిటైల్, ఆహారం, ఇతర రంగాల్లోని అత్యవసర విభాగాల్లో కొందరు విధులు నిర్వహిస్తున్నారు. సహోద్యోగులు, ఇతర కారణాల వల్ల తమకూ వైరస్ సోకుతుందేమోనని వీరంతా భయాందోళన చెందుతున్నారు. అలాంటి వారికి పలు సంస్థలు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నాయి.

తమ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, ప్రత్యేక రవాణా వంటి సదుపాయాలు ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలు అండగా నిలుస్తున్నాయి.‘ మా స్టోర్లలో విధులు నిర్వహిస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్న సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి ప్రోత్సాహకంగా రోజుకు రూ.200 అలవెన్స్​ ఇస్తున్నాం’ అని వాల్​మార్ట్ అధికార ప్రతినిధి చెప్పారు. 

భవిష్యత్‌పై అనిశ్చితి, అభద్రతా భావం నెలకొన్నప్పుడు ఆందోళన ఎక్కువగా ఉంటుందని ప్రముఖ మానసిక నిపుణులు తెలిపారు. భవిష్యత్ గురించి ఆందోళన చేయడం మాని ప్రస్తుతం మనం చేయగలిగిన విషయాలపై దృష్టి సారిస్తే ఆనందంగా ఉండవచ్చని చెబుతున్నారు.

ఉద్యోగం ఉంటుందో, పోతుందో మన చేతుల్లో ఉండదు. కానీ ఎంత ఖర్చు చేయాలనే విషయం మన చేతుల్లోనే ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. అనవసర, విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపుగా ఉండాలని, ఇలా చేస్తే ఉద్యోగం ఉన్నా లేకపోయినా కొద్ది రోజలు పాటు సంతోషంగా జీవించవచ్చునని, ఆ తర్వాత వృత్తి గురించి నిర్ణయం తీసుకోవచ్చునని మానసిక నిపుణులు తెలిపారు. 

కొత్త పరిస్థితులకు అలవాటు పడటం మనుషులకున్న గొప్ప లక్షణమని మానసిక నిపుణులు వెల్లడించారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా తర్వాత మార్పు వస్తుందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా మనం అలవాటుపడొచ్చని పేర్కొన్నారు.
Follow Us:
Download App:
  • android
  • ios