కరోనా మహమ్మారి నుండి తప్పించుకునేందుకు భారత ప్రభుత్వం దేశమంతా 21 రోజుల లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 25 నుండి ఈ నెల 14 వరకు 21 రోజుల లాక్ డౌన్ కొనసాగుతోంది. 

ఇలా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే అయినప్పటికీ... కరోనా కట్టడికి మాత్రం ఇది అత్యంత ఆవశ్యకం. ఇలా కఠినంగా లాక్ డౌన్ ని అమలు చేస్తుండడంతో వాతావరణ కాలుష్యం భారీ స్థాయిలో తగ్గింది. దాదాపుగా భారతదేశంలోనిఒ అన్ని నగరాల్లోనూ ఎయిర్ క్వాలిటీ బాగా మెరుగయ్యింది. 

ఇలా వాతావరణంలో కాలుష్యం తగ్గడం వల్ల నేటి ఉదయం జలంధర్ పట్టణంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొన్ని దశాబ్దాల కాలంగా చూడని ఒక అద్భుతాన్ని వారు ఈ రోజు చూడగలిగారు. 200 కిలోమీటర్ల దూరంలోని హిమాలయ పర్వతాలు వారికి వారి ఇండ్ల మీద నుంచే కనబడడంతో వారి ఆనందానికి అవధులు లేవు. 

వివరాల్లోకి వెళితే... పంజాబ్ లోని జలంధర్ పట్టణం నుండి హిమాలయ పర్వతాల్లోని దౌలాధర్  దాదాపుగా 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాధారణంగా అది జలంధర్ నుండి కనపడదు. ఇప్పటి తరం దాన్ని ఇంతవరకు చూసి ఎరుగదు. 

కానీ ఈ లాక్ డౌన్ పుణ్యామాని... వాతావరణంలో కాలుష్యం గణనీయంగా తగ్గడంతో ఇప్పుడు ఒక్కసారిగా ఆకాశం నిర్మలంగా మారింది. దానితో అద్భుతమైన సుందర హిమాలయాలు జలంధర్ నగర వాసుల కన్నుల ముందే ఆవిఒష్కృతమయింది. 

వారంతా ఆసక్తిగా లేవగానే ఇండ్లపైకప్పుల మీదకు చేరుకొని ఆ హిమాలయాల అందాన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ముందరి తరం వాళ్లయితే కొన్ని దశాబ్దాల తరువాత ఈ అద్భుత దృశ్యాన్ని చూశామని, గతంలో తమ చిన్నప్పుడు ఇలా కనబడ్డ హిమాలయాలు ఇప్పుడు మళ్ళీ ఇలా కనబడడం ఆనందంగా ఉందని వారు ఆనందం వ్యక్తం చేసారు.